Amaravati Bill: అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్సభ ఆమోదం.. వైసీపీ వాకౌట్
రేపు రాజ్యసభ ముందుకు అమరావతి చట్టబద్ధత బిల్లు రానుంది. దాంతో పాటు రాజ్యసభలో చర్చ జరుగుతుంది.
Amaravati Bill: ఏపీ రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్ సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. బిల్లుకు బీజేపీ, కాంగ్రెస్, ఎస్పీ, ఇతర పార్టీలు మద్దతు తెలిపాయి. అమరావతికి మద్దతు ఇస్తూనే రాజధాని రైతులకు న్యాయం చేయాలని కోరాయి. అయితే, అమరావతికి వ్యతిరేకం కాదంటూనే ఈ తరహా బిల్లుకు మద్దతు తెలపలేమని వైసీపీ అభ్యంతరాన్ని తెలిపింది. రాజధాని నిర్మాణాన్ని ఎప్పటివరకు పూర్తి చేస్తారు అనేది బిల్లులో లేదంటూ నిరసన వ్యక్తం చేస్తూ వాకౌట్ చేసింది వైసీపీ. అనంతరం అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్ సభ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక రేపు రాజ్యసభ ముందుకు అమరావతి చట్టబద్ధత బిల్లు రానుంది. దాంతో పాటు రాజ్యసభలో చర్చ జరుగుతుంది.
Also Read: AP కి కొత్త రాజధానిగా మావిగాన్ ని ప్రతిపాదించిన YS జగన్..ఎక్కడంటే..
అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుపై మాట్లాడిన కూటమి ఎంపీలు వైసీపీపై విరుచుకుపడ్డారు. అధికార వికేంద్రీకరణ పేరుతో వైసీపీ మూడు ముక్కలాట ఆడిందని ధ్వజమెత్తారు ఎంపీ పెమ్మసాని. అమరావతి నిర్మాణం చేయకుండా వైసీపీ నిర్లక్ష్యం చేసిందని, అమరావతి రైతులు మహిళలను వైసీపీ అవమానించిందన్నారు. అటు ఎంపీ సీఎం రమేశ్ మాట్లాడుతూ అమరావతిని నాశనం చేసేందుకు జగన్ ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి చట్టబద్ధత బిల్లుతో భవిష్యత్తులో ఇక అమరావతిపై మూడు ముక్కలాట ఆడలేరని వైసీపీని ఉద్దేశించి సీఎం రమేశ్ అన్నారు. కూటమి ఎంపీల వ్యాఖ్యలను వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తాము అమరావతికి వ్యతిరేకం కాదన్న ఆయన అమరావతి బిల్లు ద్వారా రాష్ట్ర ప్రయోజనాలకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు.
