మహిళతో అక్రమ సంబంధం…ఆపై అనుమానం..

పెళ్లై భర్తకు దూరంగా ఉంటున్న మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఇద్దరూ కొన్నాళ్లనుంచి సహజీవనం కూడా చేస్తున్నారు. ఇంతలో ఏమైందో ఏమో ప్రియురాలిపై అనుమానం పెరిగింది. తనతో కాక మరోకరితో కూడా ఆమె సన్నిహితంగా మెలుగుతున్నట్లు ప్రియుడు అనుమానించాడు. అనుమానం పెనుభూతమై ఓరోజు ఆమెను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు.
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం, వెంకట్రామన్న గూడెంకు చెందిన మడకం రామలక్ష్మి(45) అనే మహిళ భర్తతో విడిపోయి, ముగ్గురు పిల్లలతో వేరుగా నివాసం ఉంటోంది. కొంతకాలానికి అదే గ్రామానికి చెందిన ఎర్ర సూర్యారావు అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. అది క్రమేపి వివాహేతర సంబంధంగా మారింది. మూడేళ్లుగా వీరిద్దరూ తమ అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు.
అయితే సూర్యారావుకు రామలక్ష్మి ప్రవర్తనపై అనుమానం ఏర్పడింది. తనతో కాక మరోక వ్యక్తితో కూడా రామలక్ష్మి లైంగిక సంబంధం పెట్టుకుందేమోననే అనుమానం ఎక్కువయ్యింది. రోజు రోజుకూ అనుమానం పెరిగి రామలక్ష్మిని అంతం చేయాలనుకున్నాడు. ఓరోజు ఉదయం రామలక్ష్మిని తీసుకుని సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లాడు. అక్కడ ఆమెను గొంతు నులిమి చంపేశాడు. తాను కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
బుధవారం ఉదయం అడవిలోకి బహిర్భూమికి వెళ్లిన కొందరు రామలక్ష్మిని సుర్యారావును చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. గణపవరం సీఐ డేగల భగవాన్ ప్రసాద్ ఘటనా స్ధలానికి వచ్చి చావు బతుకుల మధ్య ఉన్న సూర్యారావును ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.