చాక్లెట్ ఇస్తే తీసుకోకుండా తిట్టినందుకు ఎదురింటి మహిళను హత్య చేసిన వ్యక్తి
అతడి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చింది.

Representative image
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం గీతానగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. తన కుమారుడి పుట్టినరోజు కావడంతో చాక్లెట్ ఇవ్వడానికి ఓ మహిళ వద్దకు వెళ్లాడు ఓ వ్యక్తి. ఆ మహిళ చాక్లెట్ తీసుకోకుండా తిట్టడంతో ఆమెను అతడు హత్య చేశాడు. ఆమెకు నిందితుడు డబ్బు కూడా ఇవ్వాల్సి ఉందని పోలీసులు గుర్తించారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల ఇంట్లో రమాదేవి అనే మహిళ గాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి, ఆమెను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
రమాదేవి చికిత్స పొందుతూ మృతి చెందింది. రమాదేవి ఇంటి ఎదురింట్లోనే రాజశేఖర్ ఉంటాడు. అతడి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చింది. అతడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించి, నిజాలు రాబట్టారు. గత నెల 29న తన కుమారుడు పుట్టినరోజు కావడంతో కొందరికి రాజశేఖర్ చాక్లెట్లు పంచాడు.
ఎదురింట్లో ఉన్న రమాదేవికి కూడా చాక్లెట్ ఇవ్వడానికి వెళ్లాడు. ఆమె తీసుకునేందుకు నిరాకరించింది. పైగా రాజశేఖర్ ను దూషించింది. దీంతో ఆమెను ఆగ్రహంతో కిందకు తోసి, టవల్‌తో గొంతును బిగించాడు. అనంతరం అక్కడి నుంచి వెల్లిపోయాడు. గతంలో రమాదేవి వద్ద అప్పు తీసుకుని రాజశేఖర్ తిరిగి చెల్లించలేదు. ఈ కోపంతోనే ఇప్పుడు తిట్టిందని, దీంతో ఆమెను నిందితుడు హత్య చేసినట్టు డీఎస్పీ హేమంత్ వెల్లడించారు.