Nara Lokesh on Dy CM: డిప్యూటీ సీఎం తీసుకుంటారా? నారా లోకేష్ వన్ వర్డ్ ఆన్సర్ ఇదే..
మంత్రి నారా లోకేశ్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలంటూ టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఈ అంశంపై లోకేశ్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు..

Nara Lokesh
Nara Lokesh: మంత్రి నారా లోకేశ్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలంటూ గత కొద్దిరోజులుగా ఏపీ టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్న సభలోనే నాయకులు లోకేశ్ ను డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలంటూ విజ్ఞప్తులు చేశారు. పలువురు మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు బహిరంగంగానే ఈ విషయంపై ప్రస్తావించారు. దీంతో కూటమి నాయకుల్లో గందరగోళం నెలకొంది. డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ ఉండగా లోకేశ్ కు ఇవ్వాలని అనడం సబబు కాదంటూ జనసేన నేతలు తప్పుబట్టారు. ఈ విషయంపై టీడీపీ, జనసేన నేతల మధ్య మాటామాటా పెరుగుతున్న క్రమంలో టీడీపీ అధిష్టానం ఈ అంశానికి ఫుల్ స్టాప్ పెట్టింది. నారా లోకేశ్ కు డీప్యూటీ సీఎం పదవిపై ఎవరూ మాట్లాడొద్దంటూ ఆ పార్టీ నేతలు, కార్యకర్తలకు అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. అయితే, తాజాగా ఈ అంశంపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు.
సోమవారం మంత్రి నారా లోకేశ్ విశాఖలో పర్యటించారు. ఓ పత్రికలో వచ్చిన కథనంపై ఆయన వేసిన పరువు నష్టం దావా కేసులో విశాఖ కోర్టుకు లోకేశ్ హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం కామెంట్స్ పై ఆయన స్పందించారు. ‘డిప్యూటీ సీఎం పదవి నాకు అవసరం లేదు. టీడీపీ కార్యకర్తగా చంద్రబాబు అడుగు జాడల్లో నడుస్తా. పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తా. పార్టీకి చెడ్డపేరు తీసుకొచ్చే పని ఎట్టిపరిస్థితుల్లో నేను చేయను. చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పార్టీలో అందరితో కలిసి ఓ కార్యకర్తగా పనిచేస్తానని లోకేశ్ స్పష్టం చేశారు. అదేవిధంగా.. ఒక వ్యక్తి ఒక పదవిలో మూడు సార్లు మాత్రమే కొనసాగాలి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు మరొకరికి అప్పగించాలనే ఆలోచనలో ఉన్నానని లోకేశ్ పేర్కొన్నారు. ఇదిలాఉంటే.. నారా లోకేశ్ తాజా వ్యాఖ్యలతో కూటమి ప్రభుత్వంలో అలజడి రేపిన డిప్యూటీ సీఎం పదవి అంశానికి పూర్తిగా చెక్ పెట్టినట్లయింది.
ఇదిలాఉంటే.. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదివారం జనసేన పార్టీ శ్రేణులకు బహిరంగ లేఖ రాశారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలపై కానీ, కూటమి అంతర్గత విషయాలపై కానీ పొరపాటున కూడా స్పందించవద్దని సూచించారు. Also Read: Pawan Kalyan : వాటి జోలికి వెళ్లొద్దు- జనసైనికులకు పవన్ కల్యాణ్ బహిరంగ లేఖ.. ఇంకా ఏమన్నారంటే..