Balakrishna Effect: బాలయ్య ఎఫెక్ట్.. చంద్రబాబు కీలక నిర్ణయం.. కంట్రోల్ చేసే పని ఎవరికి అప్పగించారంటే..
ఈ క్రమంలో మరోసారి అలాంటి ఘటనలు రిపీట్ అవ్వకుండా చంద్రబాబు చర్యలు చేపట్టారు. కూటమి ఎమ్మెల్యేలు ఏది పడితే అది మాట్లాడే అవకాశం లేకుండా చేస్తున్నారు.

Balakrishna Effect: ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయవర్గాల్లో దుమారమే రేపాయి. తనను ఉద్దేశించి అసెంబ్లీ వేదికగా బాలకృష్ణ వ్యంగంగా మాట్లాడటం చిరంజీవిని హర్ట్ చేసింది. వెను వెంటనే చిరంజీవి గట్టి కౌంటర్ ఇచ్చారు. జగన్ పాలనలో తనకు అవమానం జరిగిందన్న బాలయ్య వ్యాఖ్యలను చిరంజీవి ఖండించారు. అంతేకాదు.. జగన్ తనకు సాదరంగా ఆహ్వానం పలికారని, గౌరవం ఇచ్చారని చెప్పారు. బాలయ్య కామెంట్స్ కు చిరు ఇచ్చిన వివరణ కూటమి ప్రభుత్వంలో కలకలం రేపింది.
చిరంజీవి వ్యాఖ్యలు వైసీపీకి ప్లస్ అయ్యాయి. చిరంజీవి స్టేట్ మెంట్ ఆధారంగా కూటమి ప్రభుత్వాన్ని వైసీపీ నాయకులు టార్గెట్ చేశారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను లక్ష్యంగా చేసుకున్నారు. అటు తిరిగి ఇటు తిరిగి.. ఈ వ్యవహారం కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. బాలయ్య వ్యాఖ్యలు చాలా డ్యామేజ్ చేశాయనే అభిప్రాయం చంద్రబాబు సహా కూటమి నాయకుల్లో వ్యక్తమవుతోంది.
ఈ క్రమంలో మరోసారి ఇలాంటి ఘటనలు రిపీట్ అవ్వకుండా చంద్రబాబు చర్యలు చేపట్టారు. అసెంబ్లీలో కూటమి ఎమ్మెల్యేలు ఏది పడితే అది మాట్లాడే అవకాశం లేకుండా చేస్తున్నారు. ఎమ్మెల్యేలను కంట్రోల్ చేసే పనిని ఇంఛార్జ్ మంత్రులకు అప్పగిస్తూ చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.
మంత్రివర్గ సమావేశం అనంతరం వివిధ అంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు. అసెంబ్లీలో తెలిసో తెలియకో కొందరు ఎమ్మెల్యేలు ఇష్టారీతిన మాట్లాడారని చంద్రబాబు అన్నారు. తమ జిల్లా పరిధిలో ఉన్న ఏడుగురు ఎమ్మెల్యేలను నియoత్రించాల్సిన బాధ్యత ఇంఛార్జ్ మంత్రులదే అని చంద్రబాబు తేల్చి చెప్పారు. నిరంతరం ఎమ్మెల్యేలతో ఇంఛార్జ్ మంత్రులకు రాజకీయ సమన్వయం ఉండాలని సూచించారు. శాఖా పరంగా ఎలాంటి విమర్శలు వచ్చినా గట్టిగా స్పందించాలన్నారు.
చరిత్రలో తొలిసారి 93శాతం రిజర్వాయర్లలో నీటిని నింపామన్నారు చంద్రబాబు. విజన్ 2047 కు పెట్టుకున్న 10 ప్రిన్సిపల్స్ లో ఇదో కీలక పరిణామం అన్నారు. చామ్ విధానంలో పట్టణాభివృద్ధి చేపట్టిన నిర్మాణాలు ఇతర శాఖలు అందిపుచ్చుకోవాలని సీఎం చంద్రబాబు చెప్పారు. పూర్వోదయ పథకంలో ఏపీకి స్థానం లభించిన విషయాలు మంత్రులతో పంచుకున్నారు. ఈ పథకం ద్వారా దాదాపు 65 వేల కోట్ల రూపాయలు ఉద్యాన, ఆక్వా రంగాలకు వచ్చే అవకాశం ఉందన్నారు. యానిమల్ హాస్టల్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు.
విజయవాడ ఉత్సవ్ తరహాలో నెలకో ఈవెంట్ రాష్ట్రంలో స్థానిక పండుగలను ప్రోత్సహించేలా అన్ని ప్రాంతాల్లో చేపట్టాలని చంద్రబాబు చెప్పారు. కడపలో జిందాల్ ఉక్కు పరిశ్రమ 2028 కల్లా పూర్తి చేస్తామన్నారు. కర్నూలులో ఈ నెల 16న ప్రధాని మోదీ పర్యటన విజయవంతం చేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.
Also Read: తోపుదుర్తి వర్సెస్ కేతిరెడ్డి.. ధర్మవరంలో రాప్తాడు రాజకీయం.. ఇందుకేనా.?