Cyclone Montha: రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. 55 రైళ్లు రద్దు.. 27 దారి మళ్లింపు..

ఇక ఇవాళ 15 రైళ్లు దారి మళ్లించింది. రేపు మరో 12 రైళ్లు దారి మళ్లించింది.

Cyclone Montha: రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. 55 రైళ్లు రద్దు.. 27 దారి మళ్లింపు..

Updated On : October 29, 2025 / 7:14 PM IST

Cyclone Montha: మొంథా తుపాను వణకిస్తోంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులు భయపెడుతున్నాయి. మొంథా సైక్లోన్ ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. కుండపోత వర్షంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో పలు చోట్ల రైలు పట్టాలు దెబ్బతిన్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది.

ప్రయాణికుల భద్రత దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. అవాంఛనీయ ఘటనల నివారణ కోసం ముందస్తుగా పలు రైళ్లు రద్దు చేసింది. ఇవాళ 49 రైళ్లను, రేపు 6 రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించింది. ఇక ఇవాళ 15 రైళ్లు, రేపు 12 రైళ్లు దారి మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

రద్దైన రైళ్ల వివరాలను scr.indianrailways.gov.in వెబ్ సైట్ లో ఉంచారు అధికారులు. అంతేకాదు రద్దు చేసిన రైళ్ల వివరాలను ప్రయాణికుల మొబైల్ కి మేసేజ్ లు పంపింది రైల్వే శాఖ. అలాగే రద్దైన రైళ్లలో ప్రయాణికులకు టికెట్ డబ్బులు మొత్తాన్ని తిరిగి చెల్లించనుంది.

మొంథా తుఫాన్ కారణంగా రైల్వే ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడిందని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు. విజయవాడ, విశాఖపట్నం రూట్ లో ప్రయాణించాల్సిన రైళ్లు పూర్తిగా రద్దయ్యాయన్నారు. ఇప్పటివరకు 137కి పైగా రైళ్లు రద్దు చేశామన్నారు. 30 రైళ్ల దారి మళ్ళింపు చేశామన్నారు. ప్రయాణికుల రీఫండ్ కోసం ప్రధాన బస్ స్టేషన్ లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని తెలిపారు. స్టేషన్ లో టికెట్ తీసుకున్న వాళ్లు స్టేషన్ లోనే రీఫండ్ కోసం అప్లయ్ చేసుకోవాలని సూచించారు.

డోర్నకల్ రైల్వే స్టేషన్ లో వరద నీరు చేరడంతో పలు రైళ్లు నిలిచిపోయాయని తెలిపారు. అక్కడ రైల్లో ఉన్న ప్రయాణికులను ఆర్టీసీ బస్సు ద్వారా ఖమ్మం, వరంగల్ జిల్లాలకు పంపించామన్నారు. ఖమ్మంలో నిలిచిన వందే భారత్ రైలు విజయవాడ నుంచి వయా గుంటూరు మీదుగా సికింద్రాబాద్ కు చేరుకుందన్నారు. ట్రాక్ లపై నిలిచిన వరద నీరు తొలగింపు ప్రక్రియ జరుగుతోందన్నారు. పరిస్థితిని బట్టి రైళ్ల రాకపోకలపై నిర్ణయం తీసుకుంటామని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ వెల్లడించారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాన్.. కాకినాడ-మచిలీపట్నం మధ్య నర్సాపురానికి సమీపంలో తీరం దాటినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. మొంథా తుఫాన్ ఏపీలో పెను విధ్వంసం సృష్టించింది. కుండపోత వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. కోస్తా జిల్లాల్లోని అనేక గ్రామాలు, పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మరంగా సహాయక చర్యల్లో పాల్గొన్నాయి.
తీరాన్ని తాకిన మొంథా తుపాను.. బలహీనపడి తీవ్ర వాయుగుండంగా, ఆపై వాయుగుండంగా మారింది. ఈ తుపాను కారణంగా కోస్తా జిల్లాల్లో పంటలకు అపారమైన నష్టం కలిగింది.

Also Read: మొంథా తుపాను.. రద్దు చేసిన రైళ్లు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి? దక్షిణ మధ్య రైల్వే ఏం చెప్పిందంటే?