Mudragada: ముద్రగడ పద్మనాభంకు ఐసీయూలో చికిత్స.. ఆందోళనలో అభిమానులు.. తండ్రిని చూసేందుకు ఆస్పత్రికి కుమార్తె..
కాకినాడ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముద్రగడను చూసేందుకు ఆయన కుమార్తె క్రాంతి ఆస్పత్రికి..

Mudragada Padmanabham
Mudragada Padmanabham: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం అస్వస్థతకు గురయ్యారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. శనివారం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రి వైద్యులు ముద్రగడకు డయాలసిస్ చేస్తున్నారు.
ముద్రగడ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆక్సిజన్ సహాయంతో ఊపిరి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే.. గత కొంతకాలంగా ముద్రగడ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. కొద్దిరోజులుగా కూతురు విషయంలో జరుగుతున్న వివాదంతో మానసిక ఒత్తిడికి ముద్రగడ గురైనట్లు చెబుతున్నారు. అయితే, శనివారం రాత్రి కాకినాడ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముద్రగడను చూసేందుకు ఆయన కుమార్తె క్రాంతి ఆస్పత్రికి చేరుకున్నారు.
ముద్రగడ ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే, ముద్రగడ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ముద్రగడ ఆరోగ్యం క్షీణించిందని వస్తున్న వార్తలపై ఆయన కుమారుడు ముద్రగడ గిరిబాబు స్పందించారు. ముద్రగడ ఆరోగ్యం నిలకడగానే ఉందని, అభిమానులు ఆందోళన చెందవద్దని తెలిపారు.