Chandrababu..Lokesh : ఢిల్లీకి బయలుదేరిన నారా లోకేశ్, రేపు హైదరాబాద్‌కు చంద్రబాబు
రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబు విడుదల అయి అమరావతిలోని తన నివాసానికి చేరుకున్నారు. ఈక్రమంలో ఆయన కుమారుడు నారా లోకేశ్ ఢిల్లీకి బయలుదేరారు. అలాగే చంద్రబాబు రేపు హైదరాబాద్ రానున్నారు.

Nara chandrababu .. Nara lokesh
Chandrababu : స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో అవినీతి జరిగిందనే ఆరోపణలో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు 52 రోజుల తరువాత బెయిల్ పై విడుదల అయ్యారు. మంగళవారం (అక్టోబర్ 31,2023) రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి సాయంత్రం 4 గంటల సమయంలో బయటకు వచ్చిన తరువాత రాత్రి అంతా దాదాపు 14 గంటల పాటు రోడ్డు మార్గంలో ప్రయాణించి అమరావతి ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. చంద్రబాబు విడుదలకు ఆనందిస్తు దారి పొడుగునా రాత్రి సమయంలో కూడావేచి ఉండి జనాలు నీరాజనాలు పలికారు. వీరిలో అధిక సంఖ్యలో మహిళలు కూడా ఉన్నారు.ఆనందంతో బాబుపై పూల వర్షం కురిపించారు.
ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు.దీంతో నేతలు, కార్యకర్తలు ఎవ్వరు ఆయన నివాసానికి రావద్దని విజ్ఞప్తి చేశారు. ఈరోజు మధ్యాహ్నాం వరకు చంద్రబాబు విశ్రాంతి తీసుకుని సాయంత్రం 4.00లకు హైదరాబాద్ రానున్నారు. రేపు నగరంలోని ఏఐజీ హాస్పిటల్ లో ఆయన వైద్య పరీక్షలు చేయించుకుంటారు. అనంతరం ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో కంటి పరీక్షలు చేయించుకోనున్నారు.
మరోపక్క చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ ఢిల్లీకి బయలుదేరారు. చంద్రబాబు కోర్టు కేసులకు సంబంధించి ఢిల్లీలో న్యాయ నిపుణులతో చర్చలు జరపనున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణలో ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసుతో పాటు చంద్రబాబుపై ఉన్న ఇతర కేసుల విషయంపై కూడా లోకేశ్ న్యాయ నిపుణులతో సంప్రదింపులు చేయనున్నారు.
తిరుపతి పర్యటన రద్దు..
కాగా..రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చిన చంద్రబాబు బుధవారం తిరుపతి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవాల్సి ఉంది. కానీ..ఆయనకు వైద్య పరీక్షలకు వెంటనే హైదరాబాద్ తీసుకురావాలని కుటుంబ సభ్యులకు వైద్యులు సూచనలు చేయడంతో తిరుమల పర్యటన వాయిదా పడిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసం నుంచి నేరుగా వైద్య పరీక్షల కోసం హైదరాబాద్ వెళ్తారు. అయితే, బుధవారం చంద్రబాబు ఎవరినీ కలవరని, ఈ విషయాన్ని నాయకులు, కార్యకర్తలు గమనించాలని అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు.