నెల్లూరు కెమికల్ ఫ్యాక్టరీ అగ్ని ప్రమాదంలో క్షతగాత్రులకు అందని వైద్యం

  • Published By: bheemraj ,Published On : July 29, 2020 / 07:08 PM IST
నెల్లూరు కెమికల్ ఫ్యాక్టరీ అగ్ని ప్రమాదంలో క్షతగాత్రులకు అందని వైద్యం

Updated On : July 29, 2020 / 7:33 PM IST

నెల్లూరు కెమికల్ ఫ్యాక్టరీ అగ్ని ప్రమాదంలో గాయపడిన బాధితులకు సరైన వైద్యం అందడం లేదని వాపోతున్నారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురికి ఫ్యాక్టరీ యాజమాన్యం సరైన చికిత్స చేయించడం లేదని వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వింజుమూరు మండలం చంద్రపడియాలోని కెమికల్ ఫ్యాక్టరీలో ఇవాళ తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమదంలో నలుగురు గాయపడటంతో తొలుత నెల్లూరులోని కిమ్స్ లో జాయిన్ చేశారు. అయితే బాధితుల్లో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండటంతో యాజమాన్యం వారిని మెరుగైన చికిత్స కోసం చెన్నైలోని అపోలో తీసుకెళ్లింది.

అయితే అపోలో ఆస్పత్రిలో చేర్చుకునేందుకు నిరాకరించడంతో ఓ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చేతులు దులుపుకుంది. అక్కడ కూడా సరైన చికిత్స ఇవ్వడం లేదంటూ బాధితులు వాపోతున్నారు. ఒళ్లంత కాలిపోయి నరకం అనుభవిస్తున్నా పట్టించుకునే వారే లేరంటూ కన్నీరుపెట్టుకున్నారు. ఈ విషయం తెలియడంతో బాధితుల కుటుంబ సభ్యులు కెమికల్ ఫ్యాక్టరీ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ వారిని చెన్నైలో గాలికి వదిలేశారని ఆవేదన చెందుతున్నారు.

ఇవాళ తెల్లవారుజామున 3 గంటలకు చంద్రపడియాలోని వెంకటనారాయణ యాక్టివ్ ఇంగ్రీడియన్స్ అనే కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అక్కడున్న సిబ్బంది, యాజమాన్యం గమినించి వారికి ప్రాథమిక చికిత్స చేయించి నెల్లూరులోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కొంత సేపు చికిత్స అందించిన తర్వాత పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం చెన్నైకు తరలిస్తున్నామని అధికారులు వారి కుటుంబ సభ్యులతో చెప్పి, క్షతగాత్రులను రెండు అంబులెన్స్ లో తరలించారు.

అక్కడకు వెళ్లిన తర్వాత అపోలో ఆస్పత్రిలో బెడ్ లు ఖాళీగా లేవని వారిని అడ్మిట్ చేసుకోలేదు. ఈక్రమంలో గంటన్నర వరకు రోడ్డు మీదే ఉన్నారు. చేసేదేమీ లేక పక్కనే ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ కూడా కొంత సేపు వేచి ఉన్న తర్వాత వారిని అడ్మిట్ చేసుకున్నారు. అయితే అడ్మిట్ చేసుకునే క్రమంలో క్షతగాత్రులను బెడ్ ల మీద ఎత్తి పెట్టేందుకు కూడా ఎవరూ లేని దుస్థితి నెలకొంది. బాధితుల కుటుంబీకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యం తమను గాలికొదిలేసిందని ఆరోపిస్తున్నారు. యాజమాన్యం పట్టించుకోకుండా చేతులు దులుపుకుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.