Payyavula Keshav On Tirumala : తిరుమలకు వెళ్లి రావాలంటే అమర్నాథ్ యాత్రకు వెళ్లి వచ్చినట్లుగా ఉంది- పయ్యావుల కేశవ్

పాలకమండలి అసంబద్ధ నిర్ణయాలతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిర్లక్ష్య వైఖరి కొనసాగితే ప్రజలు ఉద్యమించాల్సి వస్తుందని..

Payyavula Keshav On Tirumala : తిరుమలకు వెళ్లి రావాలంటే అమర్నాథ్ యాత్రకు వెళ్లి వచ్చినట్లుగా ఉంది- పయ్యావుల కేశవ్

Payyavula Keshav On Tirumala

Updated On : April 13, 2022 / 5:54 PM IST

Payyavula Keshav On Tirumala : హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో నెలకొన్న పరిస్థితులపై పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భక్తుల మధ్య తోపులాట బాధాకరం అన్నారు. టీటీడీ పాలకమండలి తీరుపై ఆయన మండిపడ్డారు. తిరుపతిలో పరిస్థితులు ఇంకా చక్కబడలేదని పయ్యావుల కేశవ్ అన్నారు. రాష్ట్రం ప్రభుత్వం, పాలకమండలి పూర్తి స్థాయిలో దృష్టి సారించలేదని విమర్శించారు.

వేసవిలో చలువ పందిళ్లు కూడా వేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పాలకమండలి తీసుకుంటున్న అసంబద్ధ నిర్ణయాలతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన వాపోయారు. తిరుమలలో 1500 రూములను మూసివేశారని ఆరోపించారు. తిరుమల కింద ఉన్న హోటళ్లతో వ్యాపారాలు జరగాలి అన్నట్లు ప్రభుత్వం తీరు ఉందని విమర్శించారు.

వేసవిలో స్వామివారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసినా పాలక మండలి నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. తిరుమలను వదిలేసి ముఖ్యమంత్రి రాక కోసం ఒంటిమిట్టలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని మండిపడ్డారు. తిరుమలకు వెళ్లి రావాలంటే అమర్నాథ్ యాత్రకు వెళ్లి వచ్చినట్లుగా పరిస్థితి తయారైందన్నారు.(Payyavula Keshav On Tirumala)

TTD : తిరుపతిలో తొక్కిసలాట.. ఎండలకు అల్లాడుతున్న భక్తులు, టీటీడీ వైఫల్యమేనా ?

సుదర్శనం టికెట్ తీసుకుని రెండు గంటల్లో స్వామి వారి దర్శనం చేసుకునే భక్తులు.. ఇప్పుడు నానా ఇబ్బందులు పడుతున్నారని వాపోయరు. భక్తుల పట్ల నిర్లక్ష్య వైఖరి పదే పదే ఇలాగే కొనసాగితే తిరుమల పవిత్రత కోసం ప్రజలు ఉద్యమించాల్సి వస్తుందని పయ్యావుల కేశవ్ హెచ్చరించారు. తాను రాజకీయం కోసం ఇలా మాట్లాడటం లేదని, ఒక సామాన్య భక్తుడిగానే మాట్లాడుతున్నానని పయ్యావుల కేశవ్ అన్నారు.

‘తిరుమలలో భక్తుల ఇబ్బందులు ఇప్పటికీ పరిష్కారం కాలేదు. లక్ష మందికి ఏర్పాట్లు చేయగలిగే టీటీడీ…. ఇప్పుడు భక్తులకు చలువ పందిళ్ళు కూడా ఎందుకు వెయ్యలేదు. కొండ మీద 1500 గదులు కేటాయించక పోవడానికి కారణం ఏంటి? సీఎం వస్తారని టీటీడీ జేఈవో ఒంటిమిట్టలో కూర్చున్నారు. అసంబద్ధ నిర్ణయాల వల్లే ఈ ఇబ్బందులు. రాజకీయాలకు అతీతంగా తిరుమల పవిత్రత కోసం అంతా పోరాడాల్సిన పరిస్థితి వస్తుంది. కొండ మీద పరిస్థితి చూసి ఇతర ప్రాంతాల భక్తులు దర్శనానికి రావాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. టీటీడీ యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. భక్తులు సంతృప్తి వ్యక్తం చేసే పరిస్థితి తీసుకురావాలి’ అని పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు.

Tirupathi: తిరుపతిలో అనూహ్య రద్దీ.. అల్లాడిన భక్తులు, టీటీడీ ఘోర వైఫల్యం..10tv సాయం

తిరుమల శ్రీవారి సర్వదర్శన టోకెన్ల కోసం మంగళవారం భక్తులు భారీగా ఎగబడటంతో తోపులాట చోటుచేసుకుంది. గత రెండు రోజులుగా టోకెన్ల పంపిణీ నిలిపివేయడంతో టికెట్ల కోసం భక్తులు తిరుపతిలో వేచి ఉన్నారు. మంగళవారం మళ్లీ సర్వదర్శనం టోకెన్ల కౌంటర్లు తెరవడంతో భక్తులు భారీగా ఎగబడ్డారు. దీంతో తిరుమల శ్రీవారి సన్నధిలో తోపులాట జరిగింది. ఈ క్రమంలో పలువురు భక్తులు గాయపడ్డారు. దీంతో తిరుమలలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీటీడీ విజిలెన్స్‌, పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా భక్తులను నిలువరించలేకపోయారు. గాయపడిన వారిని వెంటనే రుయా ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందించారు. మండుటెండల్లో, దాహంతో తడారిపోతున్న గొంతులతో, ఏడుస్తున్న పిల్లా, పాపలతో గంటల కొద్దీ క్యూలైన్లలో వేచి ఉండాల్సి రావడం… అంతసేపు ఎదురుచూసినా టోకెన్లు దొరుకుతాయో లేదో తెలియని సందిగ్ధత భక్తుల్ని తీవ్ర అసహనానికి గురిచేసింది. తిరుమలలో తోపులాట ఘటన రాజకీయ దుమారం కూడా రేపింది. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని, టీటీడీ పాలక మండలిని టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి.