చేతికి సెలైన్ సూదితోనే : పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం

  • Published By: veegamteam ,Published On : April 6, 2019 / 04:08 PM IST
చేతికి సెలైన్ సూదితోనే : పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం

Updated On : April 6, 2019 / 4:08 PM IST

గుంటూరు : జనసేన చీఫ్ అధినేత పవన్ కళ్యాణ్ అస్వస్థత నుంచి కోలుకున్నారు. ఆ వెంటనే ఎన్నికల ప్రచార బరిలోకి దిగారు. చేతికి సెలైన్ సూదితోనే పవన్ ప్రచారం చేశారు. వడదెబ్బ కారణంగా శనివారం(ఏప్రిల్ 6, 2019) పగలంతా విశ్రాంతి తీసుకున్న పవన్ సాయంత్రం తెనాలి చేరుకున్నారు. నాదెండ్ల మనోహర్ తో కలిసి ప్రచారం నిర్వహించారు. ప్రచారం కోసం వచ్చిన పవన్ కల్యాణ్ చేతికి సెలైన్ ఎక్కించే సూది అలాగే ఉంది. దాన్నిబట్టి ఆయన చికిత్స మధ్యలోనే ప్రచారానికి వచ్చినట్టు అర్థమవుతోంది. ఎన్నికల ప్రచారం మరి కొన్ని రోజుల్లో ముగియనుంది. దీంతో అభ్యర్థుల కోసం పవన్ తన ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా వచ్చినట్టు తెలుస్తోంది.

శుక్రవారం(ఏప్రిల్ 5) పవన్ కు వడదెబ్బ తగిలింది. విజయనగరం జిల్లాలో ప్రచారం చేస్తుండగా జ్వరం వచ్చింది. ఎండలను సైతం లెక్కచేకుండా వరసగా తిరుగుతుండటంతో తీవ్ర అలసటకు కూడా గురయ్యారు పవర్ స్టార్. నీరసంగా ఉన్న పవన్ కు పరీక్షలు నిర్వహించారు వైద్యులు. కొంత రెస్ట్ తీసుకోవాలని సూచించారు. డాక్టర్ల సూచనతో పవన్ రెస్ట్ తీసుకున్నారు. శనివారం(ఏప్రిల్ 6) సాయంత్రం ప్రచారం మొదలుపెట్టారు.

టీడీపీ నాయకుల్లా భూములు ఆక్రమించుకునేందుకు తాను రాజకీయాల్లోకి రాలేదని పవన్ అన్నారు. తమ పార్టీ నేతలు కూడా భూకబ్జాలు చేసేందుకు రాలేదని అన్నారు. తాము ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసేందుకు వచ్చామని, అదే సమయంలో వ్యవస్థలను దెబ్బతీస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. తాను పైకి ఎంత మెత్తగా కనిపిస్తానో, ప్రజలకు నష్టం జరుగుతుంటే మాత్రం అంతే కటువుగా వ్యవహరిస్తానని అన్నారు.