అప్పుడు నా ఫ్యాన్ అని చెప్పుకో.. ఎమ్మెల్యేకు పవన్ చురకలు

ఎమ్మెల్యేలుగా చట్ట సభలకు వెళ్లాల్సిన మీరు పోలీసోళ్ల చొక్కాలు పట్టుకుంటున్నారే. ఒకవేళ రేపు పొరపాటున మీకు అధికారం వస్తే ఎవరినైనా బ్రతకనిస్తారా? రోడ్ల మీద తిరగనిస్తారా? అంటూ వైసీపీ ఎమ్మెల్యేలపై మండిపడ్డారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరులో పర్యటించిన పవన్ కళ్యాణ్.. పుచ్చలపల్లి సుందరయ్య తిరిగిన నేల ఇదియని, రాజకీయం కొన్ని కుటుంబాల సొత్తు కాదని, కొత్త తరం నాయకులు రావాలని పవన్ అన్నారు. జమైన నాయకుడంటే ప్రజా సమస్యలు తీర్చేవాడే కానీ, ‘నన్ను సీఎం చేయండి.. మీ సమస్యలు పరిష్కరిస్తా’ అనే వారు కాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్‌ను ఎద్దేవా చేశారు.
అలాగే నెల్లూరు నగర ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ అభ్యర్థి అయినప్పటికీ.. నా అభిమాని అని చెప్తుంటాడు. రెండు మూడు సార్లు కలిశాడు. నువ్వు బెట్టింగులు మానేసి.. నా అభిమాని అని చెప్పుకో అని పవన్ కళ్యాణ్ చెప్పారు. నెల్లూరు జిల్లాలో నేతలు ఎక్కువగా బెట్టింగులు కాస్తుండటంపై మాట్లాడిన పవన్.. నెల్లూరులో ఉన్న వైసీపీ అభ్యర్థులు ఎమ్మెల్యేలా బెట్టింగ్ రాయుళ్లా? జెండా ఏ వైపు ఎగురుతాది అనే వాటి పైన కూడా బెట్టింగులు ఆడుతారట వీళ్లు. మీకెందుకు రాజకీయాలు క్లబ్బుల్లో కూర్చుని పేకాట, బెట్టింగులు ఆడుకోండి అని సూచించారు.