గత ప్రభుత్వం జల్‌జీవన్ మిషన్‌లో 4వేల కోట్లు దుర్వినియోగం చేసింది : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జల్‌జీవన్ మిషన్‌ను బలోపేతం చేస్తున్నామని పవన్ కల్యాణ్ తెలిపారు.

Pawan Kalyan
Pawan Kalyan: జల్‌జీవన్ మిషన్‌ను మరింత బలోపేతం చేస్తామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. విజయవాడలో జల్‌జీవన్ మిషన్ పథకం అమలుపై రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ జరిగింది. ఈ వర్క్ షాప్ ను పవన్ కల్యాణ్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రోజుకు మనిషికి సగటున 55 లీటర్లు పరిశుభ్రమైన నీటిని ఇవ్వాలనేది ప్రధాని నరేంద్ర మోదీ కల అని, నిరంతరం ప్రతిఒక్కరికీ నీటి సరఫరా ఉండాలనే ఆకాంక్షతో ఈ జల్‌జీవన్ మిషన్ ప్రారంభమైందని అన్నారు. ఉన్న నీటి వనరులు బలోపేతం చేయడం, నిర్వహణ ముఖ్యం. ఉద్యోగులే కాకుండా ప్రజలను కూడా భాగస్వాములు చేయాలనేది ఆలోచన. నీటి సరఫరాలో తరచూ వచ్చే ఇబ్బందుల పరిష్కారానికి అమృతధార కింద విధివిధానాలు రూకల్పన చేస్తామని పవన్ అన్నారు.
Also Read: టీడీపీ కార్యక్రమాల్లో చొరబడి చిల్లర పనులు చేయటం వైసీపీ నేతలకు మొదటి నుంచీ అలవాటే: పార్థసారథి
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జల్‌జీవన్ మిషన్‌ను బలోపేతం చేస్తున్నామని పవన్ కల్యాణ్ తెలిపారు. 2019లో ప్రారంభం అయినా గత ప్రభుత్వం సక్రమంగా అమలు చేయలేదని, గత ప్రభుత్వం ఈ పథకానికి 26వేల కోట్లు మాత్రమే అడిగారని, 4వేల కోట్లు మాత్రమే కేంద్రం నుండి తీసుకురాగలిగారని అన్నారు. ఈ పథకంలో రిజర్వాయర్స్ నుండే నీటిని తీసుకోవాలి. కానీ, గత ప్రభుత్వం గ్రౌండ్ లెవల్ నుండి తీశారు. అవసరం లేకపోయినా పైపు లైన్లు, బోర్ వెల్స్ వేశారని పవన్ విమర్శించారు. వచ్చిన కొద్దిపాటి నిధులనుసైతం సక్రమంగా వినియోగించలేదని, 4వేల కోట్లు దుర్వినియోగం అయ్యాయని పవన్ అన్నారు. 4వేల కోట్లు ఏం చేశారు..? ఎవరికి నీరు ఇచ్చారు? ఎక్కడికి వెళ్లినా నీటి కొరత కనిపిస్తూనే ఉందని గత ప్రభుత్వంలో పథకం అమలు తీరుపై పవన్ ప్రశ్నించారు.
Also Read: జోగి రమేశ్ లాంటి నేతలను పార్టీలో చేర్చుకోకూడదు: టీడీపీ నేత బుద్ధా వెంకన్న సంచలన కామెంట్స్
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రిజర్వాయర్ నుండే నీటిని తెచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని, ఈ పథకానికి 70వేలకోట్లు నిధులు కావాలని నేను కేంద్రాన్ని కోరడం జరిగిందని పవన్ కల్యాణ్ చెప్పారు. ఈ మేరకు కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ ను కోరామన్నారు. పూర్తి వివరాలతో రావాలని ఆయన సూచించినట్లు వివరించారు. జనవరి నెలాఖరుకు డీపీఆర్ తీసుకొని జల్ శక్తి మంత్రికి ప్రతిపాదన పంపిస్తామని పవన్ పేర్కొన్నారు.