Pawan Kalyan : యువగళం ముగింపు కార్యక్రమానికి రాలేను : పవన్‌ కల్యాణ్

టీడీపీ నేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంది. దీంతో యుగింపు సభను భారీ ఎత్తున ఏర్పాటు చేస్తోంది టీడీపీ. యువగళం ముగింపు సభకు రావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను టీడీపీ ప్రత్యేకంగా ఆహ్వానించింది. కానీ సభకు రాలేనని జనసేనాని పవన్ కల్యాణ్ తెలిపారు.

Pawan Kalyan : యువగళం ముగింపు కార్యక్రమానికి రాలేను : పవన్‌ కల్యాణ్

pawan kalyan

Updated On : December 16, 2023 / 11:37 AM IST

pawan kalyan. Nara lokesh Yuvagalam : టీడీపీ నేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంది. దీంతో ముగింపు సభను భారీ ఎత్తున ఏర్పాటు చేస్తోంది టీడీపీ. ఈ ఏడాది జనవరి 27న ప్రారంభమైన లోకేశ్ యువగళం పాదయాత్ర డిసెంబర్ 20తో ముగియనుంది. యువగళం ముగింపు సభకు టీడీపీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. 20న విశాఖపట్నం భోగాపురం ఎయిర్ పోర్టు సమీపంలో యువగళం ముగింపు సభ జరుగనుంది. ఈ సభకు అన్ని జిల్లాల నుంచి భారీగా టీడీపీ నేతలు, కార్యకర్తలు తరలిరానున్నారు. ఈ సభకు తరలి వచ్చేందుకు ఏకంగా ప్రత్యేక రైళ్ల ఏర్పాటు కూడా చేయటం విశేషం..దాదాపు 5 లక్షలమంది ఈ సభకు వస్తారని అంచనా వేస్తోంది టీడీపీ. దీనికి తగిన ఏర్పాట్లు చేస్తోంది.

యువగళం ముగింపు సభకు రావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను టీడీపీ ప్రత్యేకంగా ఆహ్వానించింది. కానీ సభకు రాలేనని జనసేనాని పవన్ కల్యాణ్ తెలిపారు. తనకు 20న వేరే కార్యక్రమాలు ఉన్నాయని కాబట్టి రాలేనని టీడీపీ నేతలకు సమాచారం ఇచ్చారు. టీడీపీ,జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల కార్యక్రమానికి తప్పకుండా వస్తానని వెల్లడించారు. టీడీపీతో పొత్తులో జనసేన ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో యువగళం ముగింపు సభకు పవన్ వస్తే ఆ స్థాయి వేరేగా ఉంటుంది. కానీ అదే రోజున తనకు ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉన్నాయని దీంతో తాను రాలేకపోతున్నానని చెప్పారు. కానీ..ఇకపై ఎన్నికలు సమీపిస్తుండటంతో టీడీపీ నిర్వహించే పెద్ద సభలకు పవన్ హాజరుఅవుతానని చెప్పారు.

అలాగే మరో మూడు నెలల్లో ఏపీలో ఎన్నికలు జరుగనున్న క్రమంలో యువగళం ముగింపు సభను భారీగా జరపాలని భావిస్తోంది. ఇక నుంచి టీడీపీ ఎన్నికలకు సమాయత్తం కావటమే కాదు..దానికి సంబంధించిన అన్ని కార్యక్రమాల్లోను బిజి బిజీగా ఉంది. ఓవైపు వైసీపీ నుంచి భారీగా నేతలు, కార్యకర్తలు వచ్చి టీడీపీలో చేరుతున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ నిన్ననే చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. వారితో పాటు 6 నియోజకవర్గాల నుంచి పెద్దఎత్తున తరలి వచ్చిన వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు సైకిల్ ఎక్కారు. రామచంద్రపురం, తంబళ్లపల్లి, ఉదయగిరి, తాడికొండ, మంత్రాలయం, కోవూరు నియోజకవర్గాల నేతలు తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. నేతల చేరికలతో టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ సందడిగా మారింది. కాగా, వైసీపీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి సైతం టీడీపీకి మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.