జగన్ “రప్పా.. రప్పా” డైలాగ్‌పై రచ్చ కంటిన్యూ.. ఏం జరుగుతోంది?
ఈ కామెంట్స్‌పై చంద్రబాబు, లోకేశ్‌తో పాటు మంత్రుల కౌంటర్ ఒక ఎత్తు అయితే.. పవన్ కల్యాణ్ రియాక్షన్ మరో ఎత్తు.

Pawan and Jagan
పుష్ప సినిమాలోని రప్పా రప్పా డైలాగును సమర్థిస్తూ దానిని ఇమిటేట్ చేస్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన కామెంట్స్‌పై ఇప్పుడు ఏపీలో పెద్ద రచ్చే నడుస్తోంది. ఓ మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి ప్రస్తుతం ఎమ్మెల్యేగా కూడా కొనసాగుతోన్న జగన్ నేరస్తులను, నేర స్వభావాన్ని వెనకేసుకుని వస్తున్నారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. జగన్ వ్యాఖ్యలపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటికే ఘాటుగా రియాక్ట్ అయ్యారు.
రప్పా రప్పా నరుకుతా.. అనడం సినిమా డైలాగా అంటూ తీవ్రంగా స్పందించిన చంద్రబాబు..ఇలాంటి మానసిక స్థితి ఉన్నవారితో ప్రమాదమని చెప్పుకొచ్చారు. చట్టమంటే లెక్కలేనితనమా.? సినిమాల్లో లాగా బయట నరికేస్తారా అంటూ ప్రశ్నించారు. అయితే జగన్ రప్పా రప్పా డైలాగ్‌పై లేటెస్ట్‌గా జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జగన్ పేరెత్తకుండానే సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. పవన్ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇవ్వడం చర్చనీయాంశం అవుతోంది.
సినిమాలో చెప్పే డైలాగులు థియేటర్ల వరకే బాగుంటాయన్న పవన్.. వాటిని ఆచరణలో పెడతాము, ఆ డైలాగులకు అనుగుణంగా ప్రవర్తిస్తామంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. ఎవరైనా చట్టం, నియమ నిబంధనలను పాటించాల్సిందేనన్న పవన్.. ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించే అసాంఘిక శక్తులపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు ప్రభుత్వం ఇప్పటికే దిశానిర్దేశం చేసిందని తెలిపారు. అప్రజాస్వామిక ధోరణిలో మాట్లాడేవారిని ప్రజలు ఓ కంట కనిపెట్టాల్సి ఉందని పవన్ అన్నారు.
కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిని ఉపేక్షించదని పవన్ హెచ్చరించారు. అలాంటివారిపై తప్పనిసరిగా రౌడీ షీట్లు తెరిచి అసాంఘిక శక్తులను అదుపు చేస్తామని తెలిపారు. చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తామని బహిరంగంగా ప్రదర్శనలు చేసేవారిని కట్టడి చేయకపోగా వారిని సమర్థించేలా మాట్లాడేవారి మాటల వెనుక ఉద్దేశమేంటో కూడా ప్రజలు గమనించాలంటున్నారు పవన్. అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడటం కూడా నేరమే అని మరచిపోవద్దంటూ కూడా జగన్‌ను హెచ్చరించారు పవన్.
జగన్ పర్యటనలో క్యాడర్ అతి మీద డిస్కషన్
జగన్ పర్యటనలో క్యాడర్ అతి మీదే మొన్నటి నుంచే డిస్కషన్ నడుస్తోంది. అప్పటికే ఆ ప్లకార్డును ప్రదర్శించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయినా ఇవేమి పట్టించుకోకుండా..రప్పా రప్పా అంటూ సినిమా డైలాగ్ చెప్తూ..ప్లకార్డు మీద అలా రాస్తే తప్పేంటంటూ జగన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. పైగా ప్లకార్డు ప్రదర్శించిన వ్యక్తి టీడీపీ కార్యకర్త అంటూ..అతను కూడా టీడీపీ మీద కోపంతో ఆ డైలాగ్ రాసుకొని వచ్చారంటూ కూడా చెప్పుకొచ్చారు జగన్.
ఈ కామెంట్స్‌పై చంద్రబాబు, లోకేశ్‌తో పాటు మంత్రులు కౌంటర్ ఒక ఎత్తు అయితే.. పవన్ కల్యాణ్ రియాక్షన్.. వైసీపీ అధినేతతో పాటుగా ఆ పార్టీ శ్రేణులకు కూడా గట్టి హెచ్చరికలే జారీ చేశారన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా ఇకపై జగన్ ర్యాలీల్లో గానీ, సభల్లో గానీ విద్వేషపూరితమైన, రెచ్చగొట్టే వ్యాఖ్యలతో కూడిన ప్లకార్లులు పట్టుకోవడం గానీ, ఆ తరహా నినాదాలు చేయడం గానీ చేస్తే సహించేది లేదని కూడా పవన్ ఓ గట్టి వార్నింగ్ ఇచ్చారనే చెప్పాలి. జగన్ పేరును ఎక్కడా ప్రస్తావించని పవన్ జగన్ చేసిన అన్ని వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కౌంటర్ ఇచ్చారు.
మరోవైపు టీడీపీ, జనసేన విమర్శలపై వైసీపీ సోషల్ మీడియా కూడా అదే రేంజ్‌లో రియాక్ట్ అవుతోంది. జగన్ పర్యటనలో ప్లకార్డులు పట్టుకున్న వ్యక్తికి టీడీపీ కార్యకర్త అని, అతనికి పార్టీ మెంబర్ షిప్ కార్డుతో సహా టీడీపీకి కౌంటర్ ఇస్తోంది. ఇక పవన్ కల్యాణ్‌తో గతంలో వైసీపీ నాయకులను ఉద్దేశించి వాడిన సినిమా డైలాగ్‌లను కూడా కోట్ చేస్తున్నారు ఫ్యాన్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్. దీంతో రప్పా రప్పా డైలాగ్‌పై రాజకీయ రచ్చ అంతకంతకు హీట్ పెంచుతోంది. ఈ ఇష్యూ ఎంతవరకు వెళ్తుందో చూడాలి మరి.