Cm Ramesh : అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ పై కేసు నమోదు.. కారణం ఏంటంటే..
కడప బాంబులతో బెదిరించే సంస్కృతి తమది కాదని మండిపడ్డారు. అందరి జాతకాలు బయటపెడతామని హెచ్చరించారు.

Cm Ramesh
Cm Ramesh : అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ పై కేసు నమోదైంది. నిన్న చోడవరంలో జీఎస్టీ సరిగా కట్టడం లేదని ఒక షాపులో తనిఖీలు చేస్తున్న జీఎస్టీ అధికారుల విధులకు ఆటంకం కలిగించారని, అధికారులను బెదిరించారని సీఎం రమేశ్ పై కేసు నమోదు చేశారు చోడవరం పోలీసులు. సీఎం రమేశ్, చోడవరం టీడీపీ అభ్యర్థితో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేశారు. సీఎం రమేశ్ తమను బెదిరించారని అధికారుల ఫిర్యాదు మేరకు సెక్షన్ 353 కింద కేసు పెట్టారు పోలీసులు.
నిన్న చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీ కోటి రూపాయలు అడిగారని, ఇవ్వనందుకు కక్ష సాధిస్తున్నారని సీఎం రమేశ్, షాపు యజమానూలు ఆరోపించారు. వైసీపీని వీడి టీడీపీకి మద్దతు తెలిపినందుకే వ్యాపారిపై కరణం ధర్మశ్రీ వేధింపులకు దిగారని.. అధికారాన్ని అడ్డుపెట్టుకుని జీఎస్టీ అధికారులతో దాడులు చేయించారని టీడీపీ నేతలు ఆరోపించారు. కాగా, తనపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తానని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కరణం ధర్మశ్రీ హెచ్చరించారు.
అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ కు కౌంటర్ ఇచ్చారు చోడవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కరణం ధర్మశ్రీ. చోడవరం ప్రాంతంలో ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకుంటున్నారని.. వ్యాపారస్తులకు తాను ఎప్పుడూ అడ్డు రాలేదన్నారు. ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్య అల్లర్లు సృష్టించాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు కరణం ధర్మశ్రీ. కడప బాంబులతో బెదిరించే సంస్కృతి తమది కాదని సీఎం రమేశ్ పై మండిపడ్డారు. అందరి జాతకాలు బయటపెడతామని హెచ్చరించారు కరణం ధర్మశ్రీ.
”సీఎం రమేశ్ ఎక్కడి నుంచో వచ్చారు. ఈ జిల్లాకు, నియోజకవర్గానికి, ఊరికి సంబంధం లేని వ్యక్తి. మా ఉత్తరాంధ్రకు సంబంధం లేదు. మీరిచ్చే డబ్బు మూటలకు ఇక్కడి టీడీపీ నేతలు లొంగిపోయి రాజకీయంగా పైచేయి సాధిద్దామని అనుకుంటున్నారు. మీ ఆటలు సాగవు” అని కరణం ధర్మశ్రీ అన్నారు.
Also Read : ఎమ్మెల్యే వెలగపూడి విజయ పరంపరకు బ్రేక్ పడుతుందా? విశాఖ తూర్పులో రసవత్తర పోరు