ఈ ఆరోపణ నిరూపిస్తే రాజీనామాకు నేను సిద్ధం: నారా లోకేశ్

"ఇకపై ఏపీకి పరిశ్రమలు వస్తాయి కానీ, ఒక్క పరిశ్రమ కూడా బయటకు పోదు" అని అన్నారు.

ఈ ఆరోపణ నిరూపిస్తే రాజీనామాకు నేను సిద్ధం: నారా లోకేశ్

Updated On : May 27, 2025 / 4:01 PM IST

పని చేయడానికి కొత్తగా పదవి అక్కర్లేదని.. ఇచ్చిన పదవి చాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఇవాళ మహానాడులో ఆయన మాట్లాడుతూ.. “20 లక్షల ఉద్యోగాలు కల్పించడం ప్రభుత్వ లక్ష్యం. ఐటీ కంపెనీలకు 99 పైసలకే భూమి కేటాయిస్తా. దావోస్ లో మాటిచ్చా ఆ ప్రకారం టీసీఎస్ కి భూమి కేటాయించా.

ఉరసా సంస్థకు ఎకరం 99 పైసలకు ఇచ్చినట్లు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం. టీసీఎస్‌కు 99 పైసలకు ఇచ్చాం. కానీ ఉరసాకు మాత్రం మార్కెట్‌ ధరకే ఇచ్చాం. ఏపీ నుంచి పరిశ్రమలు పారిపోవు. ఇప్పుడు ఏపీలో వైసీపీ సర్కారు లేదు. ఇకపై ఏపీకి పరిశ్రమలు వస్తాయి కానీ, ఒక్కటి కూడా బయటకు పోదు” అని అన్నారు.

Also Read: మహానాడు తర్వాత టీడీపీలో నారా లోకేశ్‌కి ప్రమోషన్? ఈ సారి ఈ పదవి?

గత ఎన్నికల్లో సీనియర్ల కంటే జూనియర్లే ప్రభుత్వంలో కీలకంగా మారారని, మంత్రి వర్గంలో యువతకు ఎక్కువ అవకాశాలు వచ్చాయని లోకేశ్ తెలిపారు. “యువగళంలో మిషన్ రాయలసీమ ప్రకటించా. మిషన్ రాయలసీమ వికేంద్రీకరణకు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. మాహానాడులో ఆరు సూత్రాలపై సుదీర్ఘ చర్చ ఉంటుంది.

కూటమి ప్రభుత్వంలో విద్యాశాఖలో ఉన్నత ప్రమాణాలను పాటిస్తున్నాం. రాబోయే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 49 మంది విద్యార్థుల కంటే ఎక్కువ ఉంటే రెండో సెక్షన్ ఏర్పాటు చేస్తున్నాం. ప్రధానితో సమావేశం అదృష్టంగా భావిస్తున్నా. ప్రధాని దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ప్రధానితో రాష్ట్ర పరిస్థితిపై చర్చించాం. తండ్రి సమానులైన మోదీ సలహాలతో నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది. కుప్పంలో పాడి పరిశ్రమకి కట్టుబడి ఉన్నాం” అని లోకేశ్ చెప్పారు.