చదువుకున్న వాళ్లకు రూ.4 వేలు ఇస్తూ వీర్యాన్ని సేకరించిన “సృష్టి” టెస్ట్ ట్యూబ్ సెంటర్.. దంపతుల ఆర్థిక స్తోమతను బట్టి వసూళ్లు
వైద్య వృత్తికి కళంకం తెచ్చేలా డాక్టర్ అట్లూరి నమ్రత వ్యవహరించారు. IVF కోసం వస్తున్న దంపతులను సరగోసి వైపు మళ్లించారు.

సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో పోలీసుల విచారణలో నమ్మలేని నిజాలు బయటకు వచ్చాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వీర్యం, అండాల సేకరణ పేరుతో వికృత దందా జరుగుతోందని తేల్చారు. ఒక్కొక్కరి నుంచి ఒక్కక్క రేటుకు వీర్యాన్ని సేకరిస్తున్నట్లు చెప్పారు. ఇండియన్ స్పెర్మ్ టెక్ నుంచి “సృష్టి” టెస్ట్ ట్యూబ్ సెంటర్‌కి సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు.
చదువుకున్న వాళ్లకు రూ.4 వేలు ఇస్తూ వీర్యాన్ని సేకరించారు. మహిళలకు రూ.20 వేల నుంచి రూ.25 వేల మధ్య ఇచ్చి అండాన్ని సేకరించారు. అంతేగాక, బిచ్చగాళ్లు, కూలీలు, అమాయకులకు మందు, భోజనం ఆశచూపి వీర్యం, అండాలను సేకరించారు.
వైద్య వృత్తికి కళంకం తెచ్చేలా డాక్టర్ అట్లూరి నమ్రత వ్యవహరించారు. IVF కోసం వస్తున్న దంపతులను సరగోసి వైపు మళ్లించారు. IVF అయితే రెండు మూడు లక్షలు మాత్రమే వస్తాయని భావించిన నమ్రత.. సరోగసి అయితే దంపతుల ఆర్థిక స్తోమతను బట్టి వసూలు చేయవచ్చని భావించారు. సరోగసి కోసం 30 నుంచి 50 లక్షల రూపాయలను వసూలు చేశారు.
ఇప్పటికే 30కి పైగా జంటలు సరోగసి కోసం డబ్బులు కట్టినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులకు సరోగసి బాధితుల లిస్ట్ దొరికింది. ఇప్పటివరకు ఎన్ని సరోగసిలు జరిగాయన్నదానిపై ఆరా తీస్తున్నారు పోలీసులు. డాక్టర్ నమ్రత సహా ఎనిమిది మంది నిందితులను గోపాలపురం పోలీసులు కస్టడీకి కోరుతున్నారు. కస్టడీలో మరిన్ని విషయాలు బయటపడుతాయని భావిస్తున్నారు.