లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాతే టెన్త్ ఎగ్జామ్స్

  • Published By: vijay ,Published On : April 25, 2020 / 12:36 PM IST
లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాతే టెన్త్ ఎగ్జామ్స్

కరోనా నివారణకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ ప్రకటించిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాతే టెన్త్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం (ఏప్రిల్ 25, 2020) టెన్ టీవీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ విద్యార్థులు నష్టపోకుండా ప్రత్యేక జాగ్రత్తులు తీసుకుంటున్నామని చెప్పారు. విద్యార్థులకు నిరంతరం ఆన్ లైన్ డిజిటల్ క్లాసులు నిర్వహిస్తున్నామని తెలిపారు. పాఠశాల, ఉన్నత విద్యలోనూ డిజిటల్ విధానం అనుసరిస్తున్నామని చెప్పారు. 

ఇంటర్ వాల్యుయేషన్ జరుగడం లేదని..లాక్ డౌన్ సడలింపును బట్టి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇంగ్లీష్ మీడియంపై తల్లిదండ్రుల అభిప్రాయాలను సేకరిస్తున్నామని చెప్పారు. 2, 3 రోజుల్లో అభిప్రాయ సేకరణ పూర్తయ్యాక సుప్రీంకోర్టు లో పిటిషన్ వేస్తామని చెప్పారు. త్వరలో వచ్చే విద్యా సంవత్సరం ఫీజుల స్లాబ్ ప్రకటిస్తామని చెప్పారు. మొదటి టర్మ్ ఫీజు మాత్రమే వసూలు చేయాలని, అది కూడా విడతల్లో వసూలు చేయాలని సూచించారు. కార్పోరేట్ విద్యాసంస్థలు తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టొద్దన్నారు. ఫీజుల అంశంలో ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. 

ఏపీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 61 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 1016కు చేరింది. కాగా ఏదైతే జరక్కూడదని అంతా ఆశించారో అది జరిగింది. శ్రీకాకుళం జిల్లాను కూడా కరోనా తాకింది. జిల్లాలో ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చింది. జిల్లాలోని పాతపట్నం మండలంలో ముగ్గురు వ్యక్తులు కరోనా బారిన పడ్డారు. దీంతో జిల్లా వాసులు, అధికారుల్లో ఆందోళన మొదలైంది. ఆ మూడు కేసులు కూడా ఒకే కుటుంబంలో వారికే నిర్థారణ అయినట్లు తెలుస్తోంది.

కరోనాతో ఇవాళ కృష్ణా జిల్లాలో ఒకరు, కర్నూలు జిల్లాలో ఒకరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కరోనా సోకి మృతి చెందిన వారి సంఖ్య 31కి చేరింది. ఇప్పటి వరకు 171 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో 814 మంది చికిత్స పొందుతున్నారు. కర్నూలు జిల్లాలో అత్యధికంగా ఇప్పటివరకు 275 కేసులు, గుంటూరు జిల్లాలో 209 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రెండు జిల్లాల్లో మరింత పకడ్బందీగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు.

ఉత్తరాంధ్రకు చెందిన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదుకాలేదని భావిస్తున్న తరుణంలో ఇవాళ(ఏప్రిల్ 25,2020) శ్రీకాకుళం జిల్లాలో మూడు పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తోంది.