Stampede : ఏపీలో విషాదం.. కాశిబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట.. తొమ్మిది మంది మృతి.. పలువురికి గాయాలు
Stampede at Kasibugga Venkateswara Temple : ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కాశీబుగ్గ వేంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది.
Stampede at Kasibugga Venkateswara Temple
Stampede at Kasibugga Venkateswara Temple : ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. కాశిబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఏకాదశి కావడంతో శనివారం ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు. ఈ క్రమంలో తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. రెయిలింగ్ ఊడిపోవడంతో భక్తులు కింద పడిపోయారు. ఈ ఘటనలో తొమ్మిది మంది భక్తులు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
శ్రీకాకుళం జిల్లా పలాసలో ఓ ప్రైవేట్ వ్యక్తి ఇటీవల కొత్తగా ఈ ఆలయాన్ని నిర్మించారు. వేంకటేశ్వర స్వామి ఆలయ తొక్కిలాట దుర్ఘటనపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంఘటన స్థలానికి హుటాహుటీన బయలుదేరి వెళ్లారు. ఘటన గురించి దేవాలయ అధికారులతో మంత్రి మాట్లాడారు. బాధిత కుటుంబాలకు మంత్రి సానుభూతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందజేయాలని అధికారులకు సూచించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు చర్యల్లో నిమగ్నమయ్యారు. సంఘటనా స్థలానికి అదనపు పోలీసు బలగాలను తరలించారు.
చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి..
కాశీబుగ్గ వేంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటన కలచివేసిందని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ ఘటనపై ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు. ‘‘ శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట ఘటన కలచివేసింది. ఈ దురదృష్టకర ఘటనలో భక్తులు మరణించడం అత్యంత విషాదకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయాల పాలైన వారికి మెరుగైన సత్వర చికిత్స అందించాలని అధికారులను ఆదేశించాను. ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాల్సిందిగా స్థానిక అధికారులను, ప్రజాప్రతినిధులకు సూచించాను’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.. మంత్రి లోకేశ్
కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట జరిగి పలువురు భక్తులు మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఏకాదశి రోజు తీవ్ర విషాదం నెలకొంది. మృతి చెందిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. తొక్కిసలాటలో గాయపడిన వారికి ప్రభుత్వం మెరుగైన వైద్య చికిత్స అందిస్తోంది. సమాచారం అందిన వెంటనే అధికారులు, జిల్లాకు చెందిన మంత్రి అచ్చెన్నాయుడుతో, స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీషతో మాట్లాడాను. బాధితులకు తక్షణ సహాయం అందజేయాలని ఆదేశించాను.
