కండక్టర్ లేకుండానే..ఏపీలో RTC సేవలు : వారికి రాయితీ కట్

ఏపీలో ఆర్టీసీ సర్వీలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడిప్పుడే బస్సులు డిపోల నుంచి బయటకు వచ్చాయి. ఏపీలోని అన్ని డిపోల నుంచి బస్సులు రోడ్డెక్కాయి. కోవిడ్ నియంత్రణ చర్యలు పాటిస్తూ బస్సులు నడుపుతున్నారు. దాదాపు రెండు నెలల నీరిక్షణకు 2020, మే 21వ తేదీ గురువారంతో తెరపడింది. మొదటి విడతగా 17 శాతం బస్సులను ప్రయాణికులకు అందుబాటులో ఉంచారు. మిగతా సర్వీసులు దశల వారీగా అందుబాటులోకి రానున్నాయి. 55 రోజులుగా డిపోలకే పరిమితమైన బస్సులు.. 2020, మే 21వ తేదీ గురువారం బయటకు వస్తున్నాయి. ఆయా డిపోల్లో సందడి వాతావరణం నెలకొంది. తెల్లవారుజాము నుంచే డ్రైవర్లు ఇతర సిబ్బంది డిపోలకు చేరుకున్నారు. డిపో యాజమాన్యం మాస్క్‌లు, శానిటైజర్‌లను అందజేసింది. బస్సులనూ పూర్తిగా శానిటైజ్ చేసి సిద్దంగా ఉంచింది. డిపో ఆవరణనూ శానిటైజ్ చేశారు. బస్సు డ్రైవర్లు, ఇతర సిబ్బంది డిపోలోకి ఎంటరయ్యే ముందు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించారు.
బుధవారమే రిజర్వేషన్లు : –
ఏపీఎస్ ఆర్టీసీలో ప్రయాణానికి బుధవారమే రిజర్వేషన్లు ప్రారంభమయ్యాయి. ఆయా ప్రాంతాలకు నడిచే బస్సుల వివరాలను APSRTC తన వెబ్‌సైట్‌లో పొందుపర్చింది. దీంతో ప్రయాణికులంతా స్పందన వెబ్‌సైట్‌లో బుకింగ్ చేసుకుంటున్నారు. ప్రస్తుతానికి ఏపీలో అన్ని ప్రాంతాల్లో బస్సులు తిరగవు. నిర్ణీత ప్రాంతాల మధ్య కొన్ని సర్వీసులను మాత్రమే నడపనున్నట్టు ఆర్టీసీ తెలిపింది. బస్సుల్లో కండక్టర్లు ఉండరు. టికెట్లు ఆన్‌లైన్‌లో రిజర్వేషన్ చేసుకోవాలని కాబట్టి.. కండక్టర్ల అవసరం లేదు. దీంతో బస్సుల్లో కండక్టర్లు కనిపించరు.
సీట్లకు మార్కింగ్: –
కరోనా నేపథ్యంలో బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. సీట్లకు మార్కింగ్ వేశారు. ఒక్కో సీటుకు ఇద్దరు మాత్రమే కూర్చుని జర్నీ చేసేలా చర్యలు తీసుకున్నారు. డిపో నుంచి బస్సు బయల్దేరే ముందు తప్పనిసరిగా శానిటైజేషన్ చేసి ప్రయాణికులను ఎక్కించుకునేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏపీలోని అన్ని డిపోల నుంచి బస్సులు నడుపుతున్నారు. మొదటి విడతగా 17 శాతం బస్సులు అంటే 1683 బస్సులు రొడ్డెక్కాయి. 436 రూట్లల్లో బస్ సర్వీసులు నడుస్తున్నాయి.
అవసరమైతే AC బస్సులు : –
పరిస్థితులకు అనుగుణంగా దశల వారీగా బస్ సర్వీసులు పెంచుతామని చెబుతున్నారు అధికారులు. అవసరమైతేనే ఏసీ బస్సులు నడపాలని ప్రభుత్వం సూచించింది. అయితే ఏసీ బస్సుల్లో దుప్పట్లు ఇచ్చే సంప్రదాయానికి స్వస్తి పలుకనున్నారు. రాష్ట్ర ప్రజల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచడం లేదు. ఆర్టీసీ బస్సుల్లో సీట్ల కుదింపు చేశారు. పల్లె వెలుగులో బస్సులో 56 సీట్లకు గాను 35 సీట్లు, ఎక్స్ ప్రెస్ లో 30 సీట్లకు గానూ 20 సీట్లు, అల్ట్రా డీలక్స్ లో 40 సీట్లకు గానూ 29 సీట్లను, సూపర్ డీలక్స్ లో 36 సీట్లకు గానూ 26 సీట్లను ఏర్పాటు చేశారు. ప్రయాణికులు బస్సెక్కాలంటే మాస్కులు తప్పనిసరి చేశారు.
ఆర్టీసీ సిబ్బందికి ఆరోగ్య సేతు యాప్ : –
ఆర్టీసీ సిబ్బందికి ఆరోగ్య సేతు యాప్ డౌన్ లోడ్ చేయడం తప్పని సరి చేశారు. 65 ఏళ్లు దాటిన వారు.. పదేళ్ల లోపు పిల్లలను అత్యవసరమేతేనే బస్సుల్లో ప్రయాణించాలని ఆర్టీసి అధికారులు సూచిస్తున్నారు. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో సిటీ బస్సులు నడపకూడదని అధికారులు నిర్ణయించారు. బస్సుల్లో సీట్ల సంఖ్య కుదించిన నేపథ్యంలో రాయితీలకు సంబంధించి ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు విద్యార్థులు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్, జర్నలిస్టులు సహా ఆయా వర్గాలకు బస్సు ఛార్జీల్లో అందిస్తోన్న రాయితీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.
రూ. 1200 కోట్ల నష్టం : –
అయితే వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం వ్యక్తిగత దూరం పాటించాల్సి రావడంతో బస్సులో సీట్లను సంఖ్యను ఆర్టీసీ ఇప్పటికే కుదించింది. ఎక్స్ ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, ఆర్డినరీ సహా ఏసీ సర్వీసుల్లోనూ సీట్ల సంఖ్యను తగ్గించింది. ఫలితంగా ఆర్టీసీకి నష్టాలు వచ్చే అవకాశం ఉంది. దీంతో ఆయా వర్గాలకు అందిస్తున్న రాయితీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ఆర్టీసీ తెలిపింది.
మూలిగే నక్కపై తాటిపండు నడినట్లు కరోనా వైరస్ ఏపీఎస్ ఆర్టీసీని కోలుకోలేని దెబ్బ తీసింది. దాదాపు రెండు నెలలుగా ప్రగతి రథ చక్రాలు ఆగిపోయాయి. లాక్ డౌన్ కాలంలో నెలకు 650 కోట్ల చొప్పున దాదాపు 1200 కోట్లు ఆర్టీసీకి నష్టం వాటిల్లింది. ఈ రెండు నెలల్లో ఉద్యోగుల జీతాలు, బస్ స్టేషన్ ల మెయింటైన్స్ కు 700 కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఖర్చులు వచ్చాయి. ఈక్రమంలో నష్టాలను తగ్గించుకునేందుకు కార్గో సర్వీస్ లను కొనసాగించాలని భావిస్తున్నారు. ఆర్టీసీ కార్గో సేవల ద్వారా గత ఏడాది 72 కోట్ల ఆదాయం వచ్చింది. బస్సుల్లో సీట్లు తీసేసి వాటిని సరుకుల రవాణ కోసం వినియోగించుకునే ఆలోచన చేస్తున్నారు.
Read: రెండు పట్టణాలు మినహా..రోడ్డెక్కనున్న ఏపీ బస్సులు..ఛార్జీలు పెంచడం లేదు