యువగళం ముగింపు సభలో టీడీపీ- జనసేన కీలక ప్రకటన.. అక్కడి నుంచే ఎన్నికల శంఖారావం

యువగళం ముగింపు సభకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు. ఈ సభనుంచే టీడీపీ,జనసేన కీలక ప్రకటన చేసే అవకాశాలున్నాయి. ఇదే సభ నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు.

యువగళం ముగింపు సభలో టీడీపీ- జనసేన కీలక ప్రకటన.. అక్కడి నుంచే ఎన్నికల శంఖారావం

Chandrababu..Pawan Kalyan

Updated On : December 18, 2023 / 11:43 AM IST

Chandrababu – Pawan Kalyan : టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంది. ఈరోజు విశాఖ జిల్లాలోని అగనంపూడి వద్ద పాదయాత్ర ముగినుంది. దీంతో యువగళం ముగింపు సభను అత్యంత భారీగా నిర్వహించనుంది టీడీపీ. విజయనగరం జిల్లాలోని భోగాపురం మండలం పోలిపల్లిలో యువగళం ముగింపు సభ జరుగనుంది. ఈ సభకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు. అంతేకాదు టీడీపీ-జనసేన ఈ సభ నుంచే కీలక ప్రకటన చేసే అవకాశాలున్నాయని సమాచారం. అలాగే ఇదే సభనుంచి ఇరు పార్టీలు ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నట్లుగా తెలుస్తోంది.

కాగా.. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో అన్ని పార్టీలు ఎన్నికల సమరానికి సమాయత్తమవుతున్నాయి. దీంట్లో భాగంగా ఇప్పటికే పొత్తులో ఉన్న టీడీపీ-జనసేన పార్టీలు కూడా ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఉమ్మడి మ్యానిఫోస్టో కోసం కసరత్తులు చేస్తున్నాయి. దీని కోసమే చంద్రబాబు, పవన్ భేటీ అయ్యారు. కీలక అంశాలపై చర్చించారు. ఎన్నికల వ్యూహం, ఏపీ సుపరిపాలన,వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం ఎలా కలిసి పని చేయాలి..? అనే అంశాలపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ చర్చించారు. వ్యూహాలు, రాజకీయ అంశాలు, పార్టీ పరంగా సంస్థాగతంగా చేయాల్సిన కార్యక్రమాలపై చర్చలు జరిపారు. భవిష్యత్తులో ఇరు పార్టీల నాయకులు కలిసికట్టుగా విజయం సాధించి.. మంచి ప్రభుత్వం, పరిపాలన అందించాలని నిర్ణయించారు.

Also Read: చంద్రబాబు, పవన్ భేటీపై అంబటి రాంబాబు ట్వీట్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన టీడీపీ నేత అయ్యన్న

ఏపీలో ఎన్నికలకు దగ్గర పడుతుండటంతో ఇరు పార్టీలు వ్యూహాల్లో వేగం పెంచారు. ఇరు పార్టీల మధ్య పొత్తు బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, రాజకీయ పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించారు. త్వరలో రాయలసీమలో బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నాయి రెండు పార్టీలు. ఉమ్మడి మ్యానిఫెస్టోను ప్రకటించేందుకు కార్యాచరణను సిద్ధం చేసే అంశంపై చర్చించారు.

నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లా కుప్పంలో 2023,జనవరి 27న ప్రారంభమైంది. మొత్తం 97 నియోజకవర్గాల్లో 226రోజులు 3,132 కిలో మీటర్ల మేర లోకేష్ పాదయాత్ర సాగింది. ప్రతి జిల్లాలోనూ లోకేశ్ యువగళం పాదయాత్రకు టీడీపీ శ్రేణులు, ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఇవాళ విశాఖ జిల్లాలోని అగనంపూడి వద్ద యువగళం యాత్ర ముగియనుంది.