పదేళ్ల తర్వాత ముగ్గురు నేతలు ఒకే వేదికపైకి.. బొప్పూడిలో బీజేపీ, టీడీపీ, జనసేన తొలిసభ.. పూర్తి వివరాలు ఇవే..

బొప్పూడిలో ప్రజాగళం సభలో ప్రధాని నరేంద్రమోదీతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒకవేదికపై కనిపించనున్నారు.

పదేళ్ల తర్వాత ముగ్గురు నేతలు ఒకే వేదికపైకి.. బొప్పూడిలో బీజేపీ, టీడీపీ, జనసేన తొలిసభ.. పూర్తి వివరాలు ఇవే..

Public Meeting

TDP-BJP-Janasena First Public Meeting : ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ ఒకే వేదికపై ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నాయి. పదేళ్ల తరువాత మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ముగ్గురు ఒకే వేదికపై కనిపించబోతున్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడిలో ప్రజాగళం పేరుతో ఇవాళ మూడు పార్టీల ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరగనుంది. ఈసభ ద్వారా ఏపీకి ఎన్డీయే కూటమి ఏం చేయబోతుంది అనేది వెల్లడించనున్నారు. అయితే, పొత్తు ఖరారైన తరువాత మూడు పార్టీలు కలిసి సంయుక్తంగా తొలిసారిగా సభ నిర్వహిస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

బొప్పూడి వద్ద 300 ఎకరాల విస్తీర్ణంలో సభా ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. ఇందులో 225 ఎకరాలను వాహనాల పార్కింగ్, హెలిప్యాడ్ కు కేటాయించారు. మొత్తం ఏడు హెలిప్యాడ్ లు సిద్ధం చేశారు. ఎందుకంటే.. ప్రధాని మోదీతో పాటు ఆయన భద్రతా సిబ్బందివి కలిపి మూడు హెలికాప్టర్లు రానున్నాయి. చంద్రబాబు, పవన్ కల్యాణ్ వేరువేరు హెలికాప్టర్లలో సభాప్రాంగణానికి చేరుకుంటారు. మరెవరైనా అతిథులు వచ్చినా ఇబ్బంది తలెత్తకుండా మరో రెండు హెలిప్యాడ్లను అదనంగా ఏర్పాటు చేశారు. 75 ఎకరాల్లో సభా వేదికతో పాటు వీఐపీలు, ప్రజలకు వేరువేరుగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఎనిమిది అడుగుల ఎత్తులో ప్రధాన వేదిక నిర్మించారు. దాని వెనుకవైపు అత్యంత ప్రముఖులకోసం గ్రీన్ రూంలుసైతం ఏర్పాటయ్యాయి. ఈ సభకోసం మొత్తం ఏడు హెలిప్యాడ్లను నిర్మించారు. సభా ప్రాంగణాన్ని ఇప్పటికే ఎస్పీజీ తమ ఆదీనంలోకి తీసుకుంది.

Also Read : MCC: దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్.. ఏమేం చేయకూడదో తెలుసా?

బొప్పూడిలో ప్రజాగళం సభలో ప్రధాని నరేంద్రమోదీతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒకవేదికపై కనిపించనున్నారు. వారితో పాటు సభావేదికపై మూడు పార్టీల సీనియర్ నేతలకు కూర్చునేలా అవకాశాన్ని కల్పించనున్నారు. ఒక్కో పార్టీ నుంచి 10 మంది వేదికపై కూర్చోనున్నారు. ఈ సభకు భారీగా జనసమీకరణ చేసేందుకు మూడు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి, ఈ సభకు గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా, ప్రకాశం, బాపట్ల, పశ్చిమగోదావరి, నెల్లూరు, ఏలూరు జిల్లాల నుంచి మూడు పార్టీల నేతలు జనసమీకరణ చేస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి 10లక్షల మంది ప్రజలు సభకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. సభాప్రాంగణంలో 20 భారీ ఎల్ఈడీ స్క్రీన్ లుసైతం ఏర్పాటయ్యాయి.

Also Read : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను 7 రోజుల ఈడీ కస్టడీకి అప్పగించిన కోర్టు

 • మోదీ షెడ్యూల్ ఇదే..
  సాయంత్రం 4.10 నిమిషాలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.
  గన్నవరం ఎయిర్ పోర్టులో ప్రధాని మోదీకి సీఎస్, డీజీపీ స్వాగతం పలకనున్నారు.
  4:50కి ప్రత్యేక వాయుసేన హెలికాప్టర్ లో బొప్పూడి సభా ప్రాంగణానికి నరేంద్ర మోడీ చేరుకుంటారు.
  బొప్పూడి సభా ప్రాంగణం వద్ద ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలకనున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్.
  అనంతరం బహిరంగ సభలో పాల్గొననున్న మోడీ
  సాయంత్రం 5. 20 నిమిషాలకు పవన్ కళ్యాణ్ ప్రసంగం
  సాయంత్రం 5. 25 నిమిషాలకు పురందేశ్వరి ప్రసంగం
  సాయంత్రం 5.30 నిమిషాలకు చంద్రబాబు ప్రసంగం
  సాయంత్రం 5. 45 నిమిషాలకు మోడీ ప్రసంగం
  మోడీ ప్రసంగాన్ని తెలుగులో అనువదించనున్న పురందేశ్వరి.
  సాయంత్రం 6.50 నిమిషాలకు బొప్పూడి నుంచి వాయుసేన హెలికాప్టర్ లో గన్నవరం వెళ్ళనున్న మోడీ
  రాత్రి 7 గంటల 20 నిమిషాలకు గన్నవరం నుంచి ఢిల్లీకి పయనం