AP Politics: రాష్ట్రమంతా కూటమిగా.. అక్కడ మాత్రం విడివిడిగానా? ఏం జరుగుతోందో తెలుసా?

కొన్నాళ్ల నుంచి ఎవరి ప్రెస్ మీట్‌ వాళ్లేదే. ఎవరి స్టేట్‌మెంట్లు వాళ్లవే.

AP Politics: రాష్ట్రమంతా కూటమిగా.. అక్కడ మాత్రం విడివిడిగానా? ఏం జరుగుతోందో తెలుసా?

Updated On : January 23, 2025 / 9:32 PM IST

అక్కడ.. కూటమి రూట్ మార్చేసిందా.? మూడు పార్టీల నేతలు ఎవరి దారి వాళ్లు చూసుకుంటున్నారా.. రాష్ట్ర మంతటా కూటమి లీడర్లు కలిసి అడుగులు వేస్తుంటే.. అక్కడ ఎందుకు సపరేట్ స్వరం వినిపిస్తున్నారు. ఆ మూడు పార్టీల నేతలకు పొసగడం లేదా.. పొత్తు నియమాన్ని ఎందుకు విస్మరిస్తున్నారు?

ఏపీలో మూడు పార్టీల కలయికే కూటమి సర్కార్‌కు ఊపిరిపోశాయి.. పొత్తు కుదిరినప్పటి నుంచి ఆ మూడు పార్టీలది ఒకటే మాట. ఒకటే బాట. రాష్ట్రమంతటా ఇలానే ఉంది.. అక్కడక్కడ చిన్న అసమ్మతి వినిపించినా.. సర్దిచెప్పి ముందుకు వెళ్తున్నారు.. ఐతే స్టీల్‌ సీటీలో మాత్రం ఎందుకో కూటమిలో కుతకుత అన్నట్లుగా ఉంది సిచ్యువేషన్..

నిజానికి విశాఖలో కూటమి సూపర్ హిట్ అయింది. ఇటు విశాఖ, అటు అనకాపల్లి జిల్లాల్లో అన్ని స్థానాల్ని కూటమి గంపగుత్తగా కైవసం చేసుకుంది.. టీడీపీ, జనసేన, బీజేపీ ఎలాంటి భేషజాలకు పోకుండా ఐక్యంగా పని చేసి సింగిల్‌ సీటు కూడా మిస్సవ్వకుండా అభ్యర్థుల్ని గెలిపించుకున్నారు. కలిసి ఉంటే కలదు విజయం అనే సూత్రాన్ని నిజం చేసి చూపించారు.

“అభివృద్ధి” విషయాల్లో పార్టీలది ఒకే మాట 
ఆ తర్వాత కూడా ఏదైనా సమస్యపై పోరాటం చేయాల్సి వచ్చినా.. విధాన పరమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా మూడు పార్టీలు ఒకే మాట వినిపిస్తూ వచ్చాయి.. అవసరమైతే అధిష్టానం పెద్దల సూచనలు, సలహాలతో ముందుకు వెళ్తూ వచ్చారు.. రుషికొండ భవనాలు, ఎర్రమట్టి దిబ్బలు, స్టీల్ ప్లాంట్, మత్స్యకార సమస్యలు, ఫార్మా పరిశ్రమల్లో ప్రమాదాలు, విశాఖ డెయిరీ వంటి అంశాలతో పాటు అభివృద్ధికి సంబంధించిన అన్ని విషయాల్లో మూడు పార్టీలది ఒకే మాట. ఒకే బాట.

కానీ కొంతకాలంగా విశాఖ కూటమి వాయిస్‌లో తేడా కొడుతోంది.. ఎవరి గోల వారిదే.. ఎవరి నినాదం వారిదే అన్నట్లుగా మారింది.. కొన్నాళ్ల నుంచి ఎవరి ప్రెస్ మీట్‌ వాళ్లేదే. ఎవరి స్టేట్‌మెంట్లు వాళ్లవే. దీంతో ఇది కలహాల కాపురం అనే వార్తలు గుప్పుమంటున్నాయి.. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం స్పెషల్ ప్యాకేజీ ప్రకటనే కూటమిలో చిచ్చుకు కారణమనే వార్త కూడా బిగ్‌ సౌండ్ చేస్తోంది. గత రెండు, మూడేళ్లుగా విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు పోరాటం చేస్తున్నారు.

ప్రైవేటీకరణ నిలుపుదల చేసి ప్లాంట్‌ను పరిరక్షిస్తామని కూటమి నేతలు ఎన్నికల ముందు హామీలు ఇచ్చారు. పైగా ఇదే అంశాన్ని మ్యానిఫెస్టోలో కూడా పొందుపర్చారు. ఇదిలా ఉండగా కొద్ది రోజుల క్రితం స్పెషల్ ప్యాకేజీని ప్రకటించి ప్లాంట్‌కు కాస్తా చేయూతనిచ్చింది. ఈ ప్రకటన రాగానే కూటమి నేతల్లో ఉత్సాహం, ఉత్తేజం ఉరకలేసింది. అప్పటివరకు ఐక్యంగా పని చేసిన టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు ఒక్కసారిగా రూట్ మార్చేశారు. తమతో జట్టు కట్టిన పార్టీలను పక్కన పెట్టి ఎవరికి వారే సంబురాలు చేసుకున్నారు.

కేంద్ర మంత్రి కుమారస్వామి ప్యాకేజీ ప్రకటన చేయగానే టీడీపీ నేతలు రామ్‌నగర్‌లోని పార్టీ ఆఫీస్‌లో సంబురాలు చేసుకున్నారు. విశాఖ ఎంపీ శ్రీ భరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ తమ క్యాడర్‌తో కలిసి బాణాసంచా పేల్చి సందడి చేశారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు కేంద్రంతో ఉన్న పరిచయం, ఆయన చేసిన ఒత్తిడి కారణంగా ఉక్కు పరిశ్రమకు ఊపిరి పోసినట్లయిందని టీడీపీ వర్గాలు ప్రకటించాయి.

సపరేట్‌గా సంబరాలు
అదే సమయంలో జనసేన నేతలు సపరేట్‌గా సంబరాలు చేసుకున్నారు. ఉమ్మడి విశాఖ జిలాల్లోని జనసేన ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, పంచకర్ల రమేశ్ బాబు, వంశీకృష్ణ శ్రీనివాస్, సుందరపు విజయ్ కుమార్ సీతమ్మపేటలోని పార్టీ కార్యాలయంలో సెలబ్రేషన్స్ చేపట్టారు. తమ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ కటౌట్‌కు పాలాభిషేకం చేశారు. ఇదంతా పవన్‌ పుణ్యమే అని చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ దగ్గర పవన్ కల్యాణ్‌కు ఉన్న పరపతి, గతంలో ఆయన చేసిన పోరాటం, ఇచ్చిన హామీల మేరకు కేంద్రం చేయూతనిచ్చిందని జనసేన వర్గీయులు సంబరాల్లో ప్రచారాన్ని ఊదరగొట్టారు.

అప్పటి వరకు కలిసిమెలిసి పని చేసిన ఎన్డీఏ పక్షాలు విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్యాకేజీ ప్రకటన రాగానే ఎవరికివారుగా విడిపోయి సంబరాలు చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో ఉమ్మడిగా పోరాడిన నేతలు ప్యాకేజీ ప్రకటించగానే ఎందుకు విడిపోయారు. ఎవరికి వారు స్టేట్‌మెంట్లు ఎందుకు వినిపించారనే చర్చ జిల్లా అంతటా మార్మోగుతోంది.

అయితే ఇందుకు బలమైన కారణాలున్నాయనేది లోకల్ పొలిటికల్ అనలిస్ట్‌ల మాట.. కొన్ని దశాబ్ధాలుగా స్టీల్ ప్లాంట్ ఆర్థిక సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతుండగా, కేంద్రం ఇప్పుడు నిధులు ప్రకటించడం అటు కార్మికులు, వారి కుటుంబాల్లోనూ, ప్రజల్లోనూ బలమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే స్పెషల్ ప్యాకేజీ క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకునేందుకు మూడు పార్టీలు పోటిపడుతున్నాయి. భవిష్యత్తులో ఎలాంటి రాజకీయ పరిణామాలు ఎదురైనా.. సేఫ్ జోన్‌లో ఉండేందుకు మూడు పార్టీలు ప్రయత్నిస్తున్నాయనే వాదన వినిపిస్తోంది..

మొత్తానికి స్టీల్ ప్లాంట్‌ స్పెషల్ ప్యాకేజీ అంశం రాష్ట్రంలోని ఎన్డీఏ పక్షాల రూట్ మార్చేసినట్లయింది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అనే సామెత ఉండనే ఉన్నది కాబట్టి.. ఎవరి క్రెడిట్ వారు చూసుకుంటారులే అని జనం సరిపెట్టుకుంటున్నారు. ఎంత బలమైన పొత్తైనా.. ఎంత పెద్ద కూటమి అయినా సరే రాజకీయాల్లో ఎవరి గోల వారిదే అంటే ఇదేనేమో..!

Retirement age: ఉద్యోగుల రిటైర్‌మెంట్ ఏజ్‌ పెంచడం ఖాయమా? నిరుద్యోగులకు మళ్లీ నిరాశ తప్పదా?