TDP : వాలంటీర్లను తొలగించండి- కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు

TDP Complaint To EC : ఓటర్ల జాబితాలో అవకతవకలను పరిశీలించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని, కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులను రాష్ట్రానికి పంపాలని ఈసీని కోరింది టీడీపీ నేతల బృందం.

TDP : వాలంటీర్లను తొలగించండి- కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు

TDP-election-commission-of-

టీడీపీ నేతల బృందం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసింది. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నేతృత్వంలో టీడీపీ నేతలు కనకమేడల రవీంద్ర కుమార్, యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, బోండా ఉమ ఈసీని కలిసిన వారిలో ఉన్నారు. ఏపీలో దొంగ ఓట్ల చేర్పులు, ఓట్ల తొలగింపులు, టీడీపీ ఓట్లు టార్గెట్ గా తొలగించడం, వాలంటీర్లను ఎన్నికల విధుల నుంచి తప్పించడం అంశాలపై ఈసీకి ఫిర్యాదు చేసింది టీడీపీ బృందం.

Also Read : విశాఖ ఫిషింగ్ హార్బర్ లో ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరం.. నేతల పరామర్శలు.. నేనొస్తున్నానంటూ పవన్ ట్వీట్

అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర నాయకుల రాజకీయ ఒత్తిళ్లతో తప్పుడు ఓటరు జాబితాను తయారు చేస్తూ ECI ఆదేశాలను DEOలు EROలు పాటించడం లేదని ఫిర్యాదు చేశారు. ఓటర్ల జాబితాలో అవకతవకలను పరిశీలించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని, కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులను రాష్ట్రానికి పంపాలని ఈసీని కోరింది టీడీపీ నేతల బృందం. అలాగే బీఎల్ఓగా ఉన్న గ్రామ వాలంటీర్లను తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది.

దేశం ఎక్కడా ఇలా లేదు, వాలంటీర్ వ్యవస్థ దుర్వినియోగం- అచ్చెన్నాయుడు
ఏపీలో ఓట్ల తొలగింపు, బోగస్ ఓట్లు, వలంటీర్ వ్యవస్థ దుర్వినియోగం అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు చేసింది. దేశమంతా ఒక విధానం ఉంటే ఏపీలో ప్రత్యేక విధానం, వ్యవస్థ నడుస్తోందని టీడీపీ నేతలు ఆరోపించారు. వాలంటీర్లు, గ్రామ సచివాలయాన్ని ఎన్నికల వ్యవస్థలో ఉపయోగిస్తున్నారని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు.

దేశంలో ఎక్కడా ఇలా లేదన్నారు. కొత్త ఓట్ల నమోదు సహా అన్నీ వాలంటీర్ల చేతుల మీదుగా జరుగుతోందని ఆరోపణలు చేశారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని నాలుగు వేర్వేరు బూత్ లకు విడదీశారని అచ్చెన్నాయుడు చెప్పారు. చనిపోయిన వ్యక్తుల డెత్ సర్టిఫికెట్లు ఇచ్చినా ఓట్లు తొలగించలేదన్నారు. ఒకే వ్యక్తికి రెండు ఓట్లు ఉన్నాయని ఆధారాలతో సహా చూపినా వాటిని కూడా తొలగించలేదన్నారు.

Also Read : చంద్రబాబుకి బెయిల్.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ సీఐడీ, అప్రజాస్వామికం అన్న పొన్నవోలు

సచివాలయ సిబ్బంది లేకుండా చూడాలి..
”సుమారు 160 పోలింగ్ కేంద్రాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని చెప్పినా చర్యలు తీసుకోలేదు. దీనంతటికీ కారణం గ్రామ సచివాలయ వ్యవస్థే. వై ఏపీ నీడ్స్ అనే పార్టీ కార్యక్రమంలో గ్రామ సచివాలయ ఉద్యోగులు పాల్గొంటున్నారు. ఇంటింటికీ జెండాలు పట్టుకుని తిరుగుతున్నారు. మళ్లీ వారే బూత్ లెవెల్ అధికారులుగా ఉంటున్నారు. దేశంలో ఎక్కడైనా ఉపాధ్యాయులు బూత్ లెవెల్ అధికారులుగా పని చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికల విధుల్లో గ్రామ సచివాలయ సిబ్బంది లేకుండా చూడాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరాము.

అధికారుల మెడ మీద కత్తి..
కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఉద్యోగులను జిల్లా ఇంఛార్జిలుగా వేసి ఈ అవకతవకలను సరిదిద్దాలని కోరాము. ఆంధ్రప్రదేశ్ విజయవాడకి వచ్చి ఓటర్ల అంశాన్ని పరిశీలిస్తామని ఈసీ అధికారులు తెలిపారు. అధికారుల మెడ మీద కత్తి పెట్టి తాము చెప్పినట్టు వినేలా చేస్తున్నారు. మొత్తం 10 లక్షల కొత్త ఓటర్ల నమోదు కోసం దరఖాస్తులు పెడితే వాటి గురించి ఎలాంటి సమాచారం లేదు. జీరో ఇంటి నంబర్ మీద కుప్పలు తెప్పలుగా ఓట్లు నమోదు అవుతున్నాయి. తెలుగుదేశం ఓట్లు తొలగించేలా పెద్ద సంఖ్యలో దరఖాస్తులు పెట్టారు. ఎవరి హయాంలో జరిగినా సరే.. రాష్ట్రంలో ఉన్న దొంగ ఓట్లు తొలగించాలన్నదే మా డిమాండ్. ఈసీ చర్యలు తీసుకోకపోతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం” అని అచ్చెన్నాయుడు అన్నారు.