సంక్రాంతికి టీడీపీ అభ్యర్థుల జాబితా..! చంద్రబాబు నివాసానికి నేతలు క్యూ, టికెట్ కోసం ముమ్మర ప్రయత్నాలు
ఎంత మందితో లిస్టు రిలీజ్ చేయబోతున్నారు? జాబితాలో ఎవరి పేర్లు ఉంటాయి? ఎవరి పేర్లు ఉండవు? అనే టెన్షన్ అభ్యర్థుల్లో కనిపిస్తోంది.

TDP First List To Be Released On Sankranti
TDP First List : సంక్రాంతికి టీడీపీ అభ్యర్థుల జాబితా విడుదల చేస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసానికి టికెట్ల కోసం టీడీపీ నేతలు క్యూ కట్టారు. ఉదయం నుంచి ఉండవల్లి నివాసానికి తరలివస్తున్నారు ఆశాశాహులు. అభ్యర్థుల ఎంపికపైన నారా లోకేశ్ కసరత్తు చేస్తున్నారు. టీడీపీ నేతలు యార్లగడ్డ వెంకట్రావ్, బండారు శ్రావణి, నాగుల్ మీరా, బాష్యం ప్రవీణ్ సహా పలువురు నేతలు లోకేశ్ తో భేటీ అయ్యారు. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తవుతున్న నేపథ్యంలో టికెట్ ఆశిస్తున్న ఆశావాహులు లోకేశ్ దగ్గరికి చేరుకుంటున్నారు.
టీడీపీ తుది జాబితాను సిద్ధం చేస్తున్నారు చంద్రబాబు, లోకేశ్. ఈ క్రమంలో టికెట్ ఆశిస్తున్న ఆశావాహులు చంద్రబాబు, లోకేశ్ వద్దకు క్యూ కట్టారు. పలువురు నేతలు వచ్చి కలుస్తున్నారు. రిపోర్టుల ఆధారంగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు లోకేశ్. ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి టీడీపీ అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేస్తారన్న వార్తల నేపథ్యంలో టికెట్లు ఆశిస్తున్న నేతల్లో టెన్షన్ కనిపిస్తోంది. ఎంత మందితో లిస్టు రిలీజ్ చేయబోతున్నారు? జాబితాలో ఎవరి పేర్లు ఉంటాయి? ఎవరి పేర్లు ఉండవు? అనే టెన్షన్ అభ్యర్థుల్లో కనిపిస్తోంది.
గుంటూరు నుంచి బాష్యం ప్రవీణ్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. తనకు టికెట్ వస్తుందో రాదో అన్న టెన్షన్ లో ఆయన ఉన్నారు. కొన్ని రోజులు చిలకలూరిపేట టికెట్ కోసం ప్రయత్నించారు. తర్వాత పెదకూరపాడు, గుంటూరులో పలు నియోజకవర్గాలపై ఆయన ఆసక్తి చూపించారు. టికెట్ కోసం ప్రవీణ్ ఆఖరి ప్రయత్నాలు చేస్తున్నారు.
అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గానికి చెందిన బండారు శ్రావణి టికెట్ ఆశిస్తున్నారు. టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు కూడా పోటాపోటీగా టికెట్ కోసం పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బండారు శ్రావణి లోకేశ్ ను కలిసి తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. విజయవాడ వెస్ట్ నుంచి నాగుల్ మీరా వచ్చారు. కేశినేని నాని పార్టీ వీడిన తర్వాత విజయవాడలో జరిగిన రాజకీయ పరిణామాలను ఆయన లోకేశ్ కు వివరించారు. పార్టీ నుంచి ఎవరూ వెళ్లడం లేదని వివరించారు.
మరోవైపు గన్నవరం టీడీపీ ఇంఛార్జి యార్లగడ్డ వెంకట్రావు కూడా లోకేశ్ ను కలిశారు. ఇటీవలే ఆయన టీడీపీలో చేరినా చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. లోకేశ్ కు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలను యార్లగడ్డ వెంకట్రావు.. లోకేశ్ కు వివరించారు.
మొత్తంగా అభ్యర్థుల జాబితాకు సంబంధించి తుది కసరత్తు జరుగుతోంది. ఒక పక్క చంద్రబాబు, మరోపక్క లోకేశ్ ఈ తంతును పూర్తి చేస్తున్నారు.