Kolikapudi Vs Kesineni: ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే.. తిరువూరు టీడీపీలో ముదిరిన వివాదం.. అధిష్టానం సీరియస్..

ఇద్దరినీ పార్టీ ఆఫీస్ కు పిలిచారు. ఇరువురితో టీడీపీ అధిష్ఠానం భేటీ కానుంది.

Kolikapudi Vs Kesineni: ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే.. తిరువూరు టీడీపీలో ముదిరిన వివాదం.. అధిష్టానం సీరియస్..

Updated On : October 23, 2025 / 6:00 PM IST

Kolikapudi Vs Kesineni: తిరువూరు టీడీపీలో తముళ్ల మధ్య వివాదం తారస్థాయికి చేరింది. ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సై అంటే సై అంటున్నారు. ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నారు. దీంతో తిరువూరు పంచాయతీ అధిష్టానానికి చేరింది. దీనిపై పార్టీ అధిష్టానం సీరియస్ అయ్యింది. ఇద్దరినీ పార్టీ ఆఫీస్ కు పిలిచారు పల్లా శ్రీనివాస్‌. రేపు ఉదయం ఇరువురితో టీడీపీ అధిష్టానం భేటీ కానుంది.

కేశినేని చిన్ని, కొలికపూడి మధ్య మాటల యుద్ధం కాస్తా బ్యాంకు లావాదేవీల వరకు వెళ్లింది. 2024లో ఎమ్మెల్యే టికెట్ కోసం కేశినేని చిన్నికి డబ్బులు ఇచ్చానంటూ కొలికపూడి బ్యాంకు స్టేట్ మెంట్ విడుదల చేశారు. చిన్నికి ఇచ్చిన డబ్బుల వివరాలతో వాట్సాప్ స్టేటస్ పెట్టారు. తాను ఇచ్చిన డబ్బుల వివరాల గురించి రేపు మాట్లాడుకుందాం అంటూ స్టేటస్ పెట్టారు. ఎమ్మెల్యే టికెట్ కోసం ఎంపీ చిన్ని 5 కోట్లు అడిగారని కొలికపూడి సంచలన ఆరోపణలు చేశారు. మూడు దఫాల్లో 60 లక్షలు ట్రాన్స్ ఫర్ చేశానని, మరో 50 లక్షలు చిన్ని పీఏ తీసుకెళ్లాడని కొలికపూడి ఆరోపించారు. మిగతా 3.5 కోట్ల గురించి రేపు మాట్లాడుకుందాం అంటూ స్టేటస్ పెట్టారు.

ఆ తర్వాత మరో స్టేటస్ పెట్టారు కొలికపూడి. తాను జగన్ మీద పోరాటం చేసి రాజకీయాల్లోకి వచ్చానని.. కసిరెడ్డి, చెవిరెడ్డి ఇచ్చిన లిక్కర్ డబ్బులతో రాజకీయాల్లోకి రాలేదని వాట్సాప్ స్టేటస్ పెట్టారు.

Also Read: అందుకే ఈ నకిలీ మద్యం మాఫియా బయటికి వచ్చింది: వైఎస్ జగన్ సంచలన కామెంట్స్‌

ఇటు కొలికపూడి ఆరోపణలను ఖండించారు ఎంపీ కేశినేని చిన్ని. వివాదం అధిష్టానం దృష్టికి వెళ్లిందని, వారు చూసుకుంటారని చెప్పారు. తిరువూరులో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ”మొన్నటివరకు కొలికపూడి నన్ను దేవుడు అన్నారు, ఇప్పుడు దెయ్యం ఎందుకయ్యానో ఆయనే సమాధానం చెప్పాలి. చంద్రబాబు, లోకేశ్, పవన్ ను విమర్శించే వాళ్లను శత్రువుల్లాగా చూస్తా. నేను వైసీపీ నేతలతో అంటకాగే నాయకుడిని కాదు. డబ్బుకు ఆశపడే వ్యక్తిని కాను. కోవర్టులకు పదవులు ఇవ్వను” అని ఎంపీ చిన్ని అన్నారు. తాను ఏంటో విజయవాడ ప్రజలకు తెలుసున్నారు.

Also Read: పులివెందుల పొలిటికల్ పిక్చర్‌లోకి కొత్త ముఖం..! జగన్ వ్యూహం ఏంటి? వైసీపీ నేతల్లో కలవరం ఎందుకు?