ఢిల్లీకి TDP MP లు..జగన్ పాలనపై రాష్ట్రపతికి ఫిర్యాదు

వైసీపీ సర్కార్‌పై టీడీపీ ఎంపీలు కత్తులు దూస్తున్నారు. జగన్ పాలనపై వారు రాష్ట్రపతికి ఫిర్యాదు చేసేందుకు రెడీ అయ్యారు. ఇందులో భాగంగా 2020, జులై 16వ తేదీ గురువారం టీడీపీ ఎంపీలు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు వారంతా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో భేటీ అవుతారు.
13 నెలలుగా ఏపీలోని రాజకీయ పరిణామాలను రాష్ట్రపతికి నివేదించనున్నారు. ప్రాథమిక హక్కులు కాలరాయడం, భావప్రకటనా స్వేచ్ఛ కాలరాయడం, రూల్ ఆఫ్ లా ఉల్లంఘించడం, రాజ్యాంగ ఉల్లంఘనలపై కోవింద్‌కు TDP MP లు ఫిర్యాదు చేయనున్నారు.
అంతేకాదు… ఏపీలో వైసీపీ నాయకులు చేస్తోన్న హింస, విధ్వంసాలపైనా కంప్లైంట్ చేయనున్నారు. ఇళ్ల కూల్చివేత, ఆస్తుల ధ్వంసం, భూములు లాక్కోవడం, తోటల నరికివేత, బోర్‌వెల్స్ ధ్వంసం, బీసీ, ఎస్సీ, ఎస్టీ ముస్లిం మైనార్టీలపై దౌర్జన్యాల గురించి రాష్ట్రపతికి వివరించనున్నారు.
టీడీపీతో సహా ప్రతిపక్షాల నాయకులు, కార్యకర్తలపై దాడులు వైసీపీ నేతల దాడులనూ రాష్ట్రపతి కోవిండ్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ప్రతిపక్షనేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు, సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు, దళితులపై అమానుషాలు, మానవ హక్కుల ఉల్లంఘన గురించి సాక్ష్యాధారాలతో సహా రాష్ట్రపతికి వివరించనున్నారు.
ఏపీలో ప్రస్తుతం టీడీపీకి ముగ్గురు లోక్‌సభ సభ్యులు ఉన్నారు. కేశినేని నాని, గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు ఉన్నారు. ఇక రాజ్యసభలో కనకమేడల రవీంద్రకుమార్ ఉన్నారు. మరికొందరు టీడీపీ నేతలు కూడా ఎంపీల బృందంతో కలిసి వెళ్లనున్నారు.