Dhulipalla Narendra Arrest : టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్

టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల ఆంక్షలను ఉల్లంఘించడమే దీనికి కారణం. వైసీపీ నేతల మట్టి దోపిడీని నిరసిస్తూ టీడీపీ నేతలు చలో అనుమర్లపూడికి పిలుపునిచ్చారు.

Dhulipalla Narendra Arrest : టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్

Dhulipalla Narendra

Updated On : June 20, 2022 / 5:14 PM IST

Dhulipalla Narendra Arrest : టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల ఆంక్షలను ఉల్లంఘించడమే దీనికి కారణం. అసలేం జరిగిందంటే.. గుంటూరు జిల్లాలో అధికార వైసీపీ నేతల మట్టి దోపిడీని నిరసిస్తూ టీడీపీ నేతలు చలో అనుమర్లపూడికి పిలుపునిచ్చారు. ఇది గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో ఉద్రిక్తతకు దారితీసింది.

అలర్ట్ అయిన పోలీసులు చలో అనుమర్లపూడిని అడ్డుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా భారీగా పోలీసులు మొహరించారు. అలాగే అనుమర్లపూడికి వెళ్లకుండా టీడీపీ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ లు చేస్తున్నారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

అయితే, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆంక్షలు దాటుకుని తన అనుచరులతో కలిసి అనుమర్లపూడి చెరువు వద్దకు చేరుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆయనను అరెస్ట్‌ చేశారు. ఆయనతో పాటు ఆందోళనలో పాల్గొన్న టీడీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తీరుపై నరేంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్‌ సహా ఎవరి అనుమతులతో చెరువును తవ్వుతున్నారని ప్రశ్నించారు. అధికార వైసీపీ అరాచకాలకు అంతులేకుండా పోతోందని మండిపడ్డారు.(Dhulipalla Narendra Arrest)

Ayyanna Patrudu: అయ్యన్నపాత్రుడికి ఊరట.. అధికారుల తీరుపట్ల ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగి తోపులాట చోటుచేసుకుంది. ఛలో అనుమర్లపూడి పిలుపు నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు ధూళిపాళ్ల ఇంటి వద్ద మోహరించారు. అయితే పోలీసుల కళ్లుగప్పి, చెక్ పోస్టులను దాటుకుని ఎలాగో అనుమర్లపూడి చెరువువద్దకు చేరుకున్న ధూళిపాళ్ల అక్కడ ఆందోళనకు దిగారు. దీంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Pawan Kalyan: దసరా తర్వాత వైసీపీ నాయకుల సంగతి చూస్తాం.. అప్పటి వరకు భరిస్తాం

మరోవైపు ఇతర ప్రాంతాల నుంచి టీడీపీ నేతలు అనుమర్లపూడి వెళ్లకుండా పోలీసులు ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేశారు. గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ కుమార్, టీడీపీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మద్దిరాల మ్యానీలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అనుమర్లపూడికి వెళ్లడానికి సిద్దమవుతుండగా వీరి ఇళ్ల వద్దకు చేరుకున్న పోలీసులు బయటకు వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో కాసేపు టీడీపీ నాయకులు, పోలీసులకు వాగ్వాదం జరిగింది.

ఇక చలో అనుమర్లపూడికి వెళ్లేందుకు సిద్దమైన టీడీపీ నేతలు.. మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు, డేగల ప్రభాకర్‌ను సైతం పోలీసులు గృహనిర్భందం చేశారు. చలో అనమర్లపూడి నేపథ్యంలో అలర్ట్ అయిన పోలీసులు.. అనమర్లపూడిలో భారీగా మోహరించారు. దారి వెంబడి చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.

అనుమర్లపూడి పోలీసుల వలయంలో ఉంది. చుట్టుపక్కలంతా చెక్ పోస్టులను ఏర్పాటు చేసి గ్రామంలోకి ఎవ్వరినీ అనుమతించడం లేదు పోలీసులు. ప్రస్తుతం అనుమర్లపూడిలో 144 సెక్షన్ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి నిరసనలకు అనుమతించడం లేదన్నారు. తమ హెచ్చరికలను పట్టించుకోకుండా అనుమర్లపూడికి చేరుకుంటున్న టీడీపీ నాయకులను అదుపులోకి తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, టీడీపీ నాయకులు మాత్రం తగ్గేది లేదంటున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఛలో అనుమర్లపూడిని విజయవంతం చేయాలని పట్టుదలతో ఉన్నారు.