Teachers Recruitment : ఎయిడెడ్ స్కూళ్లలో టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు
రాష్ట్రంలో ఎయిడెడ్ స్కూళ్లలో టీచర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన ఎయిడెడ్ స్కూళ్లలో మాత్రమే టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు

Teachers Recruitment
Teachers Recruitment : రాష్ట్రంలో ఎయిడెడ్ స్కూళ్లలో టీచర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన ఎయిడెడ్ స్కూళ్లలో మాత్రమే టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టనుండగా, 1:40 నిష్పత్తి ప్రకారం నిబంధనలు పాటిస్తూ అవసరమైన పోస్టులు భర్తీ చేస్తారు. ఈ ప్రకారం ఏ స్కూల్ లో ఎంతమంది టీచర్ల అవసరం ఉందో గుర్తించి, ప్రభుత్వానికి నివేదిక పంపి అనంతరం భర్తీ చేస్తారు.
తొలుత ఎయిడెడ్ పాఠశాలల్లోని టీచర్ పోస్టులను రేషనలైజ్ చేయాలి. ఇందుకు గాను 2020-21 విద్యా సంవత్సరం పాఠశాల చివరి పని దినాన్ని(ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు ఏప్రిల్ 19, ఉన్నత పాఠశాలలకు ఏప్రిల్ 30) పరిగణనలోకి తీసుకోవాలి. విద్యార్థుల సంఖ్య, మంజూరైన పోస్టుల ఆధారంగా మిగులు ఉపాధ్యాయులను ఎక్కడ అవసరమో గుర్తించి ఆయా పాఠశాలలకు సర్దుబాటు చేస్తారు. జిల్లా పరిధిలోనే ఈ సర్దుబాటు/బదిలీ ప్రక్రియ చేపడతారు. ఆ తర్వాత కూడా పోస్టులు మిగిలితే, అవసరాన్ని బట్టి ఎయిడెడ్ పాఠశాలల్లో నియామకాలు చేపడతారు. ఈ నియామకాలను ఉన్నత పాఠశాలలకు ఆర్‌జేడీలు, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు డీఈవోలు చేపడతారు.
ఈ ఉత్తర్వులపై పాఠశాల విద్యా డైరెక్టర్ వెంటనే చర్యలు చేపట్టి, ప్రక్రియ పూర్తయిన వెంటనే పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శికి రిపోర్టు చేయాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు ఉత్తర్వులు, విద్యాహక్కు చట్టానికి అనుగుణంగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. అలాగే 1994 జనవరి ఒకటో తేదీ నాటి ఉత్తర్వుల్లోని రూల్ 10(12)ప్రకారం స్టాఫ్ ప్యాట్రన్ మేరకు అదనపు ఉపాధ్యాయులను గుర్తించాలి. వారిని అవసరం ఉన్న ఉన్నత పాఠశాలలకు సర్దుబాటు చేయాలి.