Students Piloted Aircraft : విమానం నడిపిన తెనాలి మున్సిపల్ స్కూల్ విద్యార్థులు
విమానం ఎక్కడం సామాన్యులకు కల లాంటిది. కానీ తెనాలి మున్సిపల్ స్కూల్ విద్యార్థులకు విమానంలో విహరించడమే కాదు.. ఏకంగా దాన్ని నడిపే అవకాశం కూడా లభించింది.

Tenali Municipal School Students Piloted The Plane
School students Piloted the Aircraft : ఆకాశంలో వెళ్లే విమానాన్ని ఆసక్తిగా చూస్తుంటాం. ఒక్కసారైనా విమానంలో ప్రయాణించాలని కలలు కంటుంటాం. విమానం ఎక్కడం సామాన్యులకు కల లాంటిది. కానీ తెనాలి మున్సిపల్ స్కూల్ విద్యార్థులకు విమానంలో విహరించడమే కాదు.. ఏకంగా దాన్ని నడిపే అవకాశం కూడా లభించింది.
గుంటూరు జిల్లా తెనాలి మారీసుపేటలోని చెంచు రామానాయుడు మున్సిపల్ ఉన్నత పాఠశాల ఎన్‌సీసీ క్యాడెట్లు పి.గంగాభవాని(9వ తరగతి), షేక్ నజీర్ అహ్మద్ (10వ తరగతి) గన్నవరం ఎయిర్‌పోర్టు బ్యారెల్‌లో ప్రాక్టికల్ ట్రైనింగ్‌లో భాగంగా ఎన్‌సీసీ అధికారి పులి భాస్కరరావుతో కలిసి శిక్షణ విమానాన్ని పరిశీలించారు.
8వ ఆంధ్రా కమాండింగ్ అధికారి, పైలెట్ అయిన పంకజ్ గుప్తా వారికి అన్ని అంశాలనూ క్షుణ్నంగా వివరించారు. విద్యార్థుల ఆసక్తిని గమనించి రెండు సీట్ల విమానంలో తాను పక్కనే కూర్చొని.. ఆ ఇద్దరితో చెరోసారి విమానాన్ని నడిపించారు. ఒక్కొక్కరు 20 నిమిషాల చొప్పున గాల్లో తేలిపోయారు.
ఏయే విమానాలుంటాయి? యుద్ధ విమానం ఎలా పనిచేస్తుంది? తదితర అంశాలపై ఎన్‌సీసీ విద్యార్థులకు శిక్షణ ఇస్తుంటారు. విజయవాడలోని 8వ ఆంధ్రా ఎయిర్ స్క్వాడ్రన్ ఈ బాధ్యతలు నిర్వర్తిస్తుంది. ఆంధ్రలో ఎయిర్‌వింగ్ పరిధిలో 13 హైస్కూళ్లుంటే, గుంటూరు జిల్లాలో 3 ఉన్నాయి. అందులో తెనాలి మునిసిపల్ స్కూలు ఒకటి. ఇక్కడి క్యాడెట్లకు అధికారులు యుద్ధ విమానాల గురించి బోధిస్తారు.
ప్రాక్టికల్స్‌లో భాగంగా గన్నవరం ఎయిర్‌పోర్టు బ్యారెల్‌లో ప్రత్యక్షంగా విమానాన్ని చూపించి.. దాని గురించి వివరిస్తారు. ఈ క్రమంలో ఆంధ్రా కమాండింగ్ అధికారి, విమానం పైలెట్ అయిన పంకజ్ గుప్తా.. తెనాలి విద్యార్థుల ఆసక్తిని గమనించి.. శిక్షణ విమానాన్ని స్వయంగా నడిపే అవకాశం కల్పించారు. విమానం ఎక్కడమే గొప్ప అనుకునే రోజుల్లో హైస్కూలు స్థాయిలోనే శిక్షణ విమానాన్ని నడపటం సంతోషంగా ఉందని విద్యార్థులు తెలిపారు.