ఏపీలో పంచాయతీ ఎన్నికలు, జిల్లాల వారీగా ఓటింగ్ శాతం

ఏపీలో పంచాయతీ ఎన్నికలు, జిల్లాల వారీగా ఓటింగ్ శాతం

Updated On : February 18, 2021 / 10:19 AM IST

Third Phase Panchayat elections : ఆంధ్రప్రదేశ్‌లో మూడో దశ పంచాయతీ ఎన్నికల్లో చెదురుముదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 80.71 శాతం పోలింగ్‌ నమోదైంది. కొన్ని గ్రామాల్లో గొడవలు జరిగాయి. కానీ పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. 13 జిల్లాల్లోని 20 రెవెన్యూ డివిజన్లలో 160 మండలాల్లో రెండు వేల 639 సర్పంచ్‌, 19 వేల 553 వార్డు మెంబర్‌ పదవులకు ఎన్నికలు జరిగాయి. 26 వేల 851 పోలింగ్ కేంద్రాలలో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పకడ్భందీగా పోలింగ్ నిర్వహించామని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఎన్నికల్లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నందుకు ఓటర్లకు ఎస్ఈసీ అభినందనలు తెలిపారు. జిల్లాలవారీగా చూస్తే శ్రీకాకుళం జిల్లాలో 80.13 శాతం, విజయనగరం జిల్లాలో 87.09 శాతం, విశాఖ జిల్లాలో 69.28 శాతం, తూర్పు గోదావరి జిల్లాలో 74.80 శాతం, పశ్చిమగోదావరి జిల్లాలో 82.73 శాతం, కృష్ణా జిల్లాలో 84.65 శాతం ఓటింగ్‌ నమోదైంది. గుంటూరు జిల్లాలో 84.80 శాతం, ప్రకాశం జిల్లాలో 82.42 శాతం, నెల్లూరు జిల్లాలో 83.15 శాతం పోలింగ్‌ జరిగింది. కడప జిల్లాలో 72.85 శాతం, కర్నూలు జిల్లాలో 83.10 శాతం, అనంతపురం జిల్లాలో 80.29 శాతం, చిత్తూరు జిల్లాలో 83.04 శాతం ఓట్లు పోలయ్యాయి.

తొలి రెండు విడతల్లో మాదిరే మూడో విడతలోనూ అధికారపార్టీ మద్దతుదారులే ఎక్కువ స్థానాలు కైవసం చేసుకున్నారు. కొన్ని గ్రామ పంచాయతీల్లో నువ్వా-నేనా అన్నట్టుగా సాగింది. టీడీపీ మద్దతుదారులు విశాఖ జిల్లాలో మాత్రమే మెరుగైన ఫలితాలు సాధించారు. మిగిలిన అన్ని పంచాయతీల్లో వైసీపీ మద్దతు దారులు గెలుపొందారు. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలోనూ ఆ పార్టీ మద్దతుదారులు ఖంగుతిన్నారు. అత్యధిక స్థానాల్లో వైసీపీ మద్దతుదారులు గెలిచారు