Flamingo Festival : మళ్లీ పక్షుల పండుగ.. నాలుగేళ్ల తర్వాత ఏపీలో ఫ్లెమింగో ఫెస్టివల్..

2001లో తొలిసారిగా పక్షుల పండుగకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

Flamingo Festival : మళ్లీ పక్షుల పండుగ.. నాలుగేళ్ల తర్వాత ఏపీలో ఫ్లెమింగో ఫెస్టివల్..

Updated On : January 18, 2025 / 7:35 PM IST

Flamingo Festival : ఏపీలో ఫ్లెమింగో పక్షుల పండుగ అట్టహాసంగా మొదలైంది. ఏటి పండుగ ముగియగానే వచ్చే ఫ్లెమింగో ఫెస్టివల్ తో రాష్ట్రం పర్యాటక శోభ సంతరించుకుంది. పులికాట్, నేలపట్టులకు వచ్చే వలస పక్షుల ప్రాముఖ్యతను తెలుపుతూ ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు జరిగే వలస పక్షుల పండుగ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.

2001లో తొలిసారిగా పక్షుల పండుగకు శ్రీకారం..
ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ను ఏపీ టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేశ్ ప్రారంభించారు. ఏటా శీతాకాలంలో పులికాట్ సరస్సు, నేలపట్టు ప్రాంతాలకు వలస వచ్చే విదేశీ విహంగాలకు ఆహ్వానం పలుకుతూ వాటి విశిష్టతను తెలియజేసేందుకు 2001లో తొలిసారిగా పక్షుల పండుగకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

Also Read : విజయవాడకు అమిత్‌ షా.. చంద్రబాబు నివాసంలో ఆయనకు విందు

అప్పటి నుంచి పులికాట్ కు వచ్చే వలస పక్షుల్లో అరుదైన ఫ్లెమింగో పేరుతో ఈ పండుగను ఏటా నిర్వహించారు. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ పక్షుల పండుగను నాలుగేళ్ల తర్వాత మళ్లీ నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ఫ్లెమింగో ఫెస్టివల్ ను అట్టహాసంగా నిర్వహిస్తోంది.

Flamingo Festival

రాష్ట్రంలోని ఐదు చోట్ల ఫ్లెమింగో ఫెస్ట్..
రాష్ట్రంలోని ఐదు చోట్ల ఈ ఫెస్ట్ ను నిర్వహిస్తున్నారు. నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం, సూళ్లూరుపేట జూనియర్ కళాశాల మైదానం, ఆటకాని తిప్ప పర్యావరణ విజ్ఞాన కేంద్రం, బీవీ పాలెం, శ్రీసిటీలో ఫ్లెమింగో ఫెస్టివల్ జరుగుతోంది. అక్టోబర్ మాసం వచ్చిందంటే చాలు నెల్లూరులోని పక్షుల విడిది కేంద్రం నేలపట్టే పర్యాటక శోభను సంతరించుకుంటుంది.

విదేశీ పక్షుల సంతానోత్పత్తి కేంద్రం, పక్షుల రక్షిత కేంద్రంగా భాసిల్లుతున్న నేలపట్టు..
దశాబ్దాలుగా నేలపట్టు విదేశీ పక్షుల సంతానోత్పత్తి కేంద్రంగానూ, పక్షుల రక్షిత కేంద్రంగానూ భాసిల్లుతోంది. ప్రతి ఏటా రంగు రంగుల పక్షులు వేల సంఖ్యలో ఇక్కడికి వచ్చి వాలతాయి. సుమారు 6 నెలల పాటు అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు ఇక్కడే విడిది చేసి సంతానోత్పత్తిని పెంచుకుని తిరిగి వెళ్లిపోతాయి. నేలపట్టు చెరువులోని కరప చెట్లపై విడిది చేసే వలస పక్షుల కిలకిలరావాలు, పులికాట్ సరస్సులో ఆహార వేటలో సాగించే విన్యాసాలు పక్షి ప్రేమికులు, పర్యాటకులను కనువిందు చేస్తాయి.

ఈ పక్షులను దేవతా పక్షులుగా ఆరాధిస్తారు…
ఈ పక్షులను స్థానికులు దేవతా పక్షులుగా ఆరాధిస్తారు. పక్షులు రావడం వల్ల వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండుతాయని నమ్ముతారు. ఆహారం కోసం పొలాల మీదుగా రాకపోకలు సాగించే క్రమంలో పక్షుల విసర్జన పదార్ధాలు పంట పొలాలపై పడి కీటకాలను నాశనం చేస్తాయనేది స్థానికుల నమ్మకం. అందుకే, ఈ ఫ్లెమింగో పక్షులను వేటాడరు. ఎవరైనా వేటాడాలని చూసినా అడ్డుకుంటారు.

Also Read : తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహారంపై టీడీపీ హైకమాండ్ సీరియస్