మంత్రి శంకర్ నారాయణ ఇంట్లో కరోనా కలకలం

ఏపీ మంత్రి శంకర్ నారాయణ ఇంట్లో కరోనా కలకలం చెలరేగింది. శంకర్ నారాయణ కుటుంబంలోని ముగ్గురు కరోనా బారినపడినట్టు తెలుస్తోంది. అయితే మంత్రికి మాత్రం కరోనా రిపోర్ట్ నెగిటివ్ వచ్చినట్టుగా అధికారులు తెలిపారు. మంత్రి శంకర్ నారాయణ మేనత్త కొన్ని రోజులుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆమె చికిత్స తీసుకున్నారు. చికిత్స పొందుతూనే శనివారం ఆమె చనిపోయారు.
అయితే మంత్రి శంకర నారాయణ ఆమె అనారోగ్యం కారణంగా చనిపోయి ఉంటుందని అందరూ భావించారు. ఎందుకైనా మంచిదని అనుమానంతో అధికారులు మంత్రి, ఆయన కుటుంబ సభ్యులకు కోవిడ్ -19 టెస్ట్‌లు నిర్వహించారు. ఈ పరీక్షల్లో మంత్రికి నెగిటివ్ వచ్చింది. అయితే మంత్రి కుటుంబంలో ముగ్గురికి కరోనా పాజిటివ్ రిపోర్టు వచ్చింది. మంత్రి కుటుంబంలో ముగ్గురికి కరోనా సోకడంతో.. ఆయన నివసిస్తున్న అనంతపురం జిల్లా ధర్మవరంలోని సాయినగర్ ప్రాంతాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారు. కాలనీ అంతా బారీకేడ్లు ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతం మొత్తాన్ని శానిటైజ్ చేశారు. ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని సూచించారు.
మరోవైపు ఏపీలో కరోన కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కొత్తగా 2020, మే 31వ తేదీ ఆదివారం 98 పాజిటివ్ కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా కేసుల సంఖ్య 3 వేల 042కి చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనాతో ఇద్దరు చనిపోయారు. కరోనా మరణాల సంఖ్య 62కి పెరిగింది. ఇప్పటివరకు 2వేల 135మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 845 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 9,370 మంది నమూనాలు పరీక్షించగా 110 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. ఇందులో రాష్ట్రంలో నమోదైన కేసులు 98. పొరుగు రాష్ట్రాలకు చెందిన వారు 12మంది ఉన్నారు. ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 3,571కి కేసులు నమోదయ్యాయి.