తిరుమల కల్తీ నెయ్యి కేసులో సెన్సేషనల్ విషయాలు

సిట్‌ హైకోర్టుకు సబ్‌మిట్‌ చేసిన రిపోర్టుతో..అసలు ఎపిసోడ్‌ ఇప్పుడే స్టార్ట్‌ అయిందన్న డిస్కషన్ జరుగుతోంది.

తిరుమల కల్తీ నెయ్యి కేసులో సెన్సేషనల్ విషయాలు

Updated On : June 6, 2025 / 9:17 PM IST

కల్తీ నెయ్యి ఎపిసోడ్‌లో సస్పెన్స్ వీడుతోంది. స్పెషల్ సిట్ దర్యాప్తు క్లైమాక్స్‌కు చేరుకుంటుంది. దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయ్. తిరుమల లడ్డూ తయారీకి డెయిరీలు సప్లై చేసింది నెయ్యే కాదని కన్ఫామ్‌ అయిందట. శ్రీవారి లడ్డూ వివాదంలో కళ్లు భైర్లు కమ్మే విషయాలు కోర్టుకు చెప్పింది సిట్. దీంతో ఇప్పటివరకు ఆరోపణలు, విమర్శలు, అనుమానాలతో కొనసాగిన వ్యవహారంలో అసలు కథ బయటికి వస్తోంది.

స్పెషల్ సిట్‌ హైకోర్టుకు సబ్‌మిట్‌ చేసిన రిపోర్టులో షాకింగ్‌ విషయాలను తెలిపింది. తిరుమల లడ్డూ తయారీ కోసం డెయిరీలు సప్లై చేసింది నెయ్యి కాదట. ఆ మాటకొస్తే అసలు అది కల్తీ నెయ్యే కాదంటోంది సిట్. పక్కా ప్రణాళిక ప్రకారం నకిలీ నెయ్యిని సరఫరా చేశారని గుర్తించారట. వివిధ రసాయనాలతో నెయ్యి లాంటి పదార్థాన్ని తయారు చేసి టీటీడీకి సప్లై చేశారట. పామాయిల్, కొన్ని రసాయనాలు, ముడి పదార్థాలు వాడి నెయ్యి తయారు చేసిందట భోలేబాబా డెయిరీ. ఈ విషయాన్ని హైకోర్టుకు ఇచ్చిన నివేదికలో స్పష్టం చేసింది స్పెషల్ సిట్.

నెయ్యి సప్లై చేసేందుకు ఏఆర్ డెయిరీ, వైష్ణవి డెయిరీతో టీటీడీ ఒప్పందం చేసుకుంది. కానీ ఆ రెండు డెయిరీల వెనుక ఉండి కథ నడిపించింది మాత్రం భోలేబాబా డెయిరీ అని సిట్ హైకోర్టుకు చెప్పింది. భోలేబాబా డెయిరీకి పాలు, నెయ్యి ఉత్పత్తి చేసే వ్యవస్థ లేదని సిట్ తేల్చిందట. మరోవైపు తమ నుంచి అసలు పాలే సేకరించలేదని రైతులే తమకు చెప్పారని సిట్ చెబుతోంది. టీటీడీకి కావాల్సిన స్థాయిలో నెయ్యి సరఫరా చేయాలంటే లక్షల లీటర్ల పాలు అవసరం అవుతుంది.

భోలేబాబా డైయిరీ నెయ్యి ఎలా తయారు చేసింది?
రైతుల నుంచి పాలే సేకరించకుండా భోలేబాబా డైయిరీ నెయ్యి ఎలా తయారు చేసిందన్నది సిట్ లేవనెత్తుతున్న ప్రశ్న. భోలేబాబా డెయిరీ పామాయిల్, రసాయనాలు, ముడిపదార్థాలతో నకిలీ నెయ్యి తయారుచేసి ఏఆర్ డెయిరీ, వైష్ణవి డెయిరీకి పంపిందని, ఈ రెండు సంస్థలు ఈ నకిలీ నెయ్యిని టీటీడీకి సరఫరా చేసినట్లు తమ విచారణలో తేలిందంటోంది సిట్. ముందస్తు కుట్ర ప్రకారమే ఏఆర్ డెయిరీ, వైష్ణవీ డెయిరీలను ముందు పెట్టి భోలేబాబా డెయిరీ వ్యవహారాన్ని నడిపిందని సిట్ చెబుతోంది.

టీటీడీ అంటే ఓ పెద్ద వ్యవస్థ. దేశంలో ఏ ఆలయానికి లేనంత పటిష్టమైన అడ్మినిస్ట్రేషన్‌ సిస్టమ్‌ టీటీడీ సొంతం. అలాంటి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు.. నెయ్యి సరఫరా విషయంలో డెయిరీలను ఎలా గుడ్డిగా నమ్మిందనేదే అంతుచిక్కడం లేదు. డెయిరీల ఉత్పత్తి సామర్థ్యం ఎంత.? వాళ్లు ఎక్కడెక్కడి నుంచి పాలు సేకరిస్తున్నారన్న వివరాలు..ఆ సంస్థల నిబద్ధతను, వారిచ్చే నెయ్యి క్వాలిటీని చెక్ చేయకుండానే ఎలా కాంట్రాక్ట్ ఇచ్చారన్న డౌట్స్ వ్యక్తం అవుతున్నాయి.

ఏఆర్‌ డెయిరీ, వైష్ణవి డైయిరీలతో నెయ్యి సరఫరా ఒప్పందం ఎలా కుదిరింది.? వాళ్లు భోలేబాబా డెయిరీతో ఎందుకు టైయప్‌ అయ్యారనేదానిపై సిట్ ఆరా తీసిందట. అయితే నకిలీ నెయ్యి సప్లై వెనుక అప్పుడు టీటీడీలో కీలకంగా పనిచేసిన అధికారులు, ముఖ్యుల పాత్ర ఉందా అని కూడా సిట్‌ దర్యాప్తు చేస్తోందట. ఆ దిశగానే ఇప్పటికే వైవీ సుబ్బారెడ్డి పీఏ అప్పన్నకు నోటీసులు ఇచ్చి విచారించింది సిట్.

సిట్‌ హైకోర్టుకు సబ్‌మిట్‌ చేసిన రిపోర్టుతో..అసలు ఎపిసోడ్‌ ఇప్పుడే స్టార్ట్‌ అయిందన్న డిస్కషన్ జరుగుతోంది. కల్తీ నెయ్యి వ్యవహారంలో అసలు మ్యాటరేంటో క్లియర్‌ కట్‌గా కోర్టుకు చెప్పేసింది సిట్. డెయిరీ యజమానులు, నెయ్యి సప్లైదారులు..అసలు సూత్రధారుల పాత్రపై రాబోయే రోజుల్లో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. నిందితులకు బెయిల్‌ ఇవ్వొద్దని వాదనలు వినిపించే క్రమంలో ఈ కీలక విషయాలను కోర్టుకు వివరించారు సిట్‌ తరఫు న్యాయవాది.

త్వరలోనే టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మాజీ టీటీడీ ఈవో ధర్మారెడ్డిని సిట్‌ నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. డెయిరీలకు నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఎలా దక్కింది.? ఏఆర్, వైష్ణవి డెయిరీలకు ఎవరైనా పట్టుబట్టి కాంట్రాక్ట్ ఇప్పించారా అన్న అంశంపై కూపీ లాగుతున్నారట. ఇప్పటికే ఎన్నో అరెస్టులు, మరెన్నో రాజకీయ విమర్శలతో హాట్ టాపిక్‌గా మారిన కల్తీ నెయ్యి వ్యవహారం..రాబోయే రోజుల్లో ఇంకా ఎటువైపు టర్న్ తీసుకుంటుందో చూడాలి మరి.