Tirumala: టీటీడీ కీలక నిర్ణయం.. వారికి ప్రతిరోజూ 100 వీఐపీ బ్రేక్ దర్శనాలు..
తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. వారికి సులభంగా తిరుమల శ్రీవారి దర్శనం లభించేలా చర్యలు చేపట్టింది.

Tirumala
TTD: తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రవాసాంధ్రులకు సులభంగా తిరుమల శ్రీవారి దర్శనం లభించేలా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో వారికి గుడ్‌న్యూస్ చెప్పింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి దర్శనానికి ప్రవాసాంధ్రులకు అందించే వీఐపీ బ్రేక్ దర్శనాల కోటాను పెంచింది. ప్రస్తుతం రోజులో 10 వీఐపీ బ్రేక్ దర్శనాలు కల్పిస్తున్న టీటీడీ.. వాటిని 100కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రవాసాంధ్రులకు ప్రతీరోజూ వంద వీఐపీ బ్రేక్ దర్శనాల కోటా అందుబాటులోకి రానుంది.
గతంలో ప్రవాసాంధ్రులకు రోజులో 50 వీఐపీ బ్రేక్ దర్శనాలు కల్పించేవారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో ఆ కోటాను రోజుకు 10కి తగ్గించారు. దీంతో విదేశాల నుంచి వచ్చే తెలుగు ప్రజలు శ్రీవారి దర్శనం చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై ఏపీ ప్రవాసాంధ్రుల సొసైటీ (ఏపీఎన్ఆర్‌టీ) అధ్యక్షుడు రవి వేమూరి ఆధ్వర్యంలో ఆ సంస్థ ప్రతినిధులు గత ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. సానుకూలంగా స్పందించిన చంద్రబాబు.. ప్రవాసాంధ్రులకు ప్రతీరోజూ వంద వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు ఇవ్వాలని టీటీడీకి సూచించారు. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రవాసాంధ్రులకు ప్రతీరోజూ 100 వీఐపీ బ్రేక్ దర్శనాల టికెట్లు మంజూరు చేసేందుకు సిద్ధమైంది.
టికెట్లు ఇలా బుక్ చేసుకోవాలి..
♦ ప్రవాసాంధ్రులు వీఐపీ బ్రేక్ దర్శనాల టికెట్లు బుక్ చేసుకోవాలంటే ముందుగా ఏపీఎన్ఆర్టీఎస్ వెబ్‌సైట్ https://www.apnrts.ap.gov.in లోకి వెళ్లి సభ్యత్వం నమోదు చేసుకోవాలి. ఇది పూర్తిగా ఉచితం.
♦ ప్రవాసాంధ్రులు ఉంటున్న దేశాల వీసాలు, వర్క్ పర్మిట్ ల వివరాలు నమోదు చేయాలి.
♦ వెబ్‌సైట్‌లో శ్రీవారి దర్శనానికి సంబంధించి మూడు నెలల స్లాట్లు కన్పిస్తాయి. అందులో స్లాట్ బుక్ చేసుకోవాలి.
♦ ఆరోజు పరిస్థితులను బట్టి టీటీడీ టికెట్లను కేటాయిస్తుంది. టికెట్లు కేటాయింపు అయిన వారికి తిరుమలలోని ఏపీఎన్ఆర్టీఎస్ కు చెందిన పీఆర్వో ద్వారా వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తారు.
♦ వివరాల కోసం ప్రవాసాంధ్రులు సంస్థ వెబ్ సైట్ ద్వారా గానీ, ఏపీలోని తాడేపల్లి, ఏపీఎన్ఆర్టీ సొసైటీ జంక్షన్ ఫోన్ నవంబర్ 08632340678లో గానీ సంప్రదించవచ్చునని సంస్థ ప్రతినిధి వెంకట్ రెడ్డి తెలిపారు.