YS Jagan : తిరుపతి లడ్డూ వివాదం.. ప్రధాని మోదీకి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేఖ.. ఏమన్నారంటే..?
లడ్డూ వివాదం విషయంలో వైసీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. దేవుడిని కూడా సీఎం చంద్రబాబు రాజకీయాల కోసం వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Jagan modi (File Photo)
Tirupati Laddu Controversy : తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు అవశేషాలు ఉన్నాయని ల్యాబ్ రిపోర్టులు రావడంతో దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. వైసీపీ హయాంలో ఈ ఘటన చోటు చేసుకోవటంతో హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇదంతా ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రలో భాగమని వ్యాఖ్యానించారు. తాజాగా లడ్డూ వివాదం విషయంపై జగన్ మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
టీటీడీ లడ్డు ప్రసాదం వివాదంలో వాస్తవాలను నిగ్గు తేల్చాలని ప్రధాని మోదీకి రాసిన లేఖలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. వంద రోజుల పాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి దారుణాలకు చంద్రబాబు పాల్పడుతున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా తిరుమల ప్రతిష్టను దెబ్బతీసే విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. రాజకీయ లబ్ధికోసం తిరుమలను చంద్రబాబు ఉపయోగించుకుంటున్నారని ప్రధానికి రాసిన లేఖలో జగన్ పేర్కొన్నారు. లడ్డూ వివాదం విషయంలో సీబీఐ విచారణ జరిపించాలని లేఖలో కోరినట్లు తెలిసింది.
ఇప్పటికే లడ్డూ వివాదం విషయంలో వైసీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. దేవుడిని కూడా సీఎం చంద్రబాబు రాజకీయాల కోసం వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూ వివాదం విషయంలో సీబీఐతో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.