Tirupati by-election : తిరుపతిలో జోరందుకున్న ఉప ఎన్నికల ప్రచారం

తిరుపతి ఉపఎన్నికలపై అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. జనసేన, బీజేపీ తలకిందులుగా తపస్సు చేసినా లాభం లేదని వైసీపీ అంటుంటే.. ఫ్యాన్‌, సైకిల్ పార్టీలు అధికారం కోసం కోట్లు కుమ్మరిస్తున్నాయని కమలం పార్టీ ఆరోపిస్తోంది.

Tirupati by-election : తిరుపతిలో జోరందుకున్న ఉప ఎన్నికల ప్రచారం

Tirupati By Election

Updated On : April 1, 2021 / 9:36 AM IST

Tirupati lok sabha by-election campaign : తిరుపతి ఉపఎన్నికలపై అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. జనసేన, బీజేపీ తలకిందులుగా తపస్సు చేసినా లాభం లేదని వైసీపీ అంటుంటే.. ఫ్యాన్‌, సైకిల్ పార్టీలు అధికారం కోసం కోట్లు కుమ్మరిస్తున్నాయని కమలం పార్టీ ఆరోపిస్తోంది. మరోవైపు.. నామినేషన్ల పరిశీలన కూడా పూర్తయ్యింది. ఎట్టి పరిస్థితుల్లోనూ తిరుపతిలో జెండా పాతాల్సిందే. ఇదే ఇప్పుడు ఏపీలోని ప్రధాన పార్టీల ప్రయత్నం. సిట్టింగ్ సీటే కాబట్టి.. గెలుపు నల్లేరుపై నడకేనని వైసీపీ అంటోంది.

భారీ మెజారిటీని టార్గెట్‌గా పెట్టుకుని పావులు కదుపుతోంది. అక్కడ వచ్చే మెజారిటీతో దేశమంతా రీసౌండ్ రావాలని నేతలకు సీఎం జగన్ ఇప్పటికే చెప్పారు. అందుకు తగ్గట్టే పార్లమెంట్‌ సెగ్మెంట్‌లో ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్కో మంత్రిని నియమించి వైసీపీ ప్రచారం నిర్వహిస్తోంది. ఉపఎన్నికల్లో సీఎం అభ్యర్ధి పవన్‌ అంటూ.. బీజేపీ చేస్తున్న ప్రచారంపై మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నలు సంధిస్తున్నారు. జనసేన, బీజేపీ నేతలు పాదయాత్రలే కాదు.. తలకిందులుగా యాత్రలు చేసినా… వైసీపీకి వచ్చిన నష్టం లేదన్నారు.

మరోవైపు.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అధికార పార్టీనే టార్గెట్ చేస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో 22 మంది ఎంపీలను గెలిపిస్తే.. రాష్ట్రానికి ఏం చేశారో జగన్‌ చెప్పాలని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ప్రత్యేక హోదా గురించి ప్రస్తుతం జగన్‌ ఎందుకు మాట్లాడటం లేదన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను కేంద్రం ప్రైవేటీకరిస్తామంటుంటే.. వైసీపీ ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

తిరుపతిలో బీజేపీ జెండా ఎగురుతుంది కాబట్టే.. వైసీపీ, టీడీపీలు తమ కూటమిని టార్గెట్ చేస్తున్నాయని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు కోట్లు కుమ్మరిస్తున్నాయన్నాయని ఆరోపించారు. ప్రజలను అసలు ఓట్లు వేయనీయకుండా అధికార పార్టీ అడ్డుకుంటోందని… ఇక 5 లక్షల మెజార్టీ ఎలా వస్తుందంటూ ప్రశ్నించారు.

మరోవైపు.. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలకు దాఖలైన నామినేషన్లను ఎన్నికల సంఘం పరిశీలించింది. బీజేపీ అభ్యర్ధి రత్నప్రభ నామినేషన్ అసంపూర్తిగా ఉందని వైసీపీ కంప్లైంట్ చేసింది. దానిని పరిశీలించిన జిల్లా కలెక్టర్‌.. బీజేపీ అభ్యర్ధి 4 నామినేషన్‌లు దాఖలు చేశారని తెలిపారు. వెబ్‌సైట్‌లో కరెక్షన్ చేసుకున్నందున సమస్య ఏమి లేదని తెలిపారు. దీంతో బీజేపీ అభ్యర్ధిపై ఉన్న నామినేషన్ రచ్చకు తెరపడింది.