ప్రేమించుకున్న ఇద్దరమ్మాయిలు, ఇంటి నుంచి పరార్.. కర్నూలులో ఘటన

two girls fall in love in kurnool: కర్నూలులో వింత ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకున్నారు. అంతేకాదు పెళ్లి కూడా చేసుకోవాలని డిసైడ్ అయ్యి ఇంటి నుంచి పారిపోయారు. సంతోష్ నగర్‌కు చెందిన 21 ఏళ్ల యువతి, నర్సింహారెడ్డి నగర్‌కు చెందిన 20 ఏళ్ల యువతి చిన్ననాటి స్నేహితులు. అది క్రమంగా ప్రేమకు దారితీసింది. వీరిలో ఒకరు ఇంటర్ చదివి ఇంటి దగ్గరే ఉంటే, మరో యువతి కర్నూలు నగరంలో డిగ్రీ చదువుతోంది.
ఇద్దరిలో ఒకరికి పెళ్లి కుదరగా… ఈ విషయం మరో అమ్మాయికి తెలిసింది. అబ్బాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని ఆ అమ్మాయి.. మరో అమ్మాయితో కలిసి నవంబర్ 3న ఇంటి నుంచి పరారయ్యింది. తామిద్దరం ప్రేమించుకున్నామని, పెళ్లి చేసుకునేందుకు ఇంటి నుంచి పారిపోయామని ఆ ఇద్దరు యువతులు తమ తల్లిదండ్రులకు ఎస్ఎంఎస్ చేశారు. దీంతో వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురై పోలీసులను ఆశ్రయించారు. కర్నూలు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.