CP Kanthi Rana Tata : సీఎం జగన్ లక్ష్యంగా దాడి జరిగింది, అక్కడ తగిలి ఉంటే ప్రాణాపాయంగా మారేది- సీపీ కీలక వ్యాఖ్యలు

నిందితుడు దొరికితే కుట్ర కోణం తెలుస్తుంది. రాయిని చాలా బలంగా, వేగంగా విసిరాడు కాబట్టే ఇద్దరికీ గాయమైంది.

CP Kanthi Rana Tata : సీఎం జగన్ లక్ష్యంగా దాడి జరిగింది, అక్కడ తగిలి ఉంటే ప్రాణాపాయంగా మారేది- సీపీ కీలక వ్యాఖ్యలు

Vijayawada CP Kanthi Rana on stone attack on cm jagan

CP Kanthi Rana Tata : సీఎం జగన్ పై రాయి దాడి ఘటనపై విజయవాడ సీపీ కాంతిరాణా టాటా మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ పై రాయి దాడి చేసిన వారి వివరాలు తెలిస్తే ఇవ్వాలని కోరారు. కేసు విచారణకు అవసరమైన సమాచారం ఇస్తే 2 లక్షలు బహుమతి ఇస్తామన్నారు. ఆధారాలు ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. 5 బృందాలు 40మందితో ఈ కేసు విచారణకు పని చేస్తున్నాయని సీపీ వెల్లడించారు. త్వరలోనే ఈ కేసును చేధిస్తామన్నారు.

” దాడి ఘటనపై సిట్ ఏర్పాటు చేశాం. ఇచ్చిన ఫిర్యాదు, జరిగిన ఘటన ఆధారంగా 307 సెక్షన్ పెట్టాం. నందిగామలో చంద్రబాబుపై జరిగిన దాడి ఘటన వేరు. అప్పుడు అన్ని కోణాల్లో విచారణ చేశాం. ఫిర్యాదు చేసిన వారిని రావాలని కోరినా స్పందించలేదు. అన్నీ పరిశీలించిన తర్వాతే ఆ సెక్షన్లు పెట్టాం.
13న సీఎం పర్యటనకు 1480 మంది సిబ్బంది విధుల్లో ఉన్నారు. రూట్ మ్యాప్ ప్రకారం సిబ్బంది బందోబస్తులో ఉన్నారు. 40 రోప్ పార్టీలు ఉంటే.. 20 రోప్ పార్టీలు సీఎం బస్సు చుట్టూ పెట్టాం. పోలీసు డిపార్ట్ మెంట్ లో ఉన్న అన్ని‌ విభాగాల అధికారులు, సిబ్బంది విధుల్లో ఉన్నారు.

సీఎం పర్యటనలో విద్యుత్ కోత ఎందుకు వచ్చింది అని అడుగుతున్నారు. సీఎం వెళ్లే రూట్ లో విద్యుత్, కేబుల్, నెట్ వైర్లు చాలా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో తొలగించినా.. మరికొన్ని ప్రాంతాల్లో సాధ్యం కాలేదు. సీఎం బస్సు పై ఉండి రోడ్ షో చేస్తున్నారు. ముఖ్యమంత్రి భద్రత కోసమే విద్యుత్ ను నిలిపివేయడం జరిగింది. కరెంట్ తీయడం సెక్యూరిటీ ప్రోటోకాల్ లో భాగమే. ఆయన భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు తీసుకున్నాం. బస్సు యాత్ర గంగానమ్మ టెంపుల్ వద్దకు వచ్చినప్పుడు సీఎం జగన్ ను లక్ష్యంగా చేసుకుని ఓ వ్యక్తి బలంగా రాయి విసిరాడు. అది ముఖ్యమంత్రికి తాకి, పక్కనే ఉన్న వెల్లంపల్లికి తగిలింది. సీఎం జగన్ పై రాయి దాడి జరిగింది.

సీసీ కెమెరాలు, ప్రజలు తీసిన వీడియో ఫుటేజీ పరిశీలించాం. ఒక వ్యక్తి ఒక రాయి విసరడం జరిగినట్టు గుర్తించాం. ఒకే రాయి సీఎం నుదిటి భాగాన తగిలి, అదే రాయి వెల్లంపల్లి కంటికి తగిలింది. 307 సెక్షన్ కింద కేసు దర్యాప్తు చేస్తున్నాం. 8 బృందాలను ఈ కేసు విచారణకు నియమించాం. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటాం. 60 సెల్ ఫోన్ వీడియోలు, ప్రత్యక్ష సాక్షులను విచారించాం. అసాంఘిక కార్యకలాపాలు చేసే వారిని విచారించాం. కొంతమంది వ్యక్తులపై అనుమానం ఉంది. వేల మందిలో నుంచి రాయి వచ్చింది. పూర్తిగా విచారణ చేసి సాక్ష్యాలు సేకరిస్తున్నాం. త్వరలోనే రాయి దాడి‌ చేసిన వారిని పట్టుకుంటాం.

సీఎంపై చేత్తోనే రాయిని విసిరారు. ఎయిర్ గన్, క్యాట్ బాల్ అనే దానికి ఆధారాలు లేవు. పడిన రాయి కూడా చేతితో సరిపోయేంత ఉంది. ఘటన జరిగి 48 గంటలైంది. ప్రాధమికంగా ఉన్న సమాచారం బట్టి మేము చెబుతున్నాం. నిందితుడు దొరికితే కుట్ర కోణం తెలుస్తుంది. దాడి ఘటన ప్రీ ప్లాన్ డా?  ఆకతాయితనంగా ఎవరైనా కుర్రాళ్లు చేశారా? అనేది తెలుస్తుంది. రాయిని చాలా బలంగా, వేగంగా విసిరాడు కాబట్టే ఇద్దరికీ గాయమైంది. సీఎంకు తగిలి, వెల్లంపల్లికి తగిలి… రాయి అవతల పడింది. సున్నితమైన భాగాల మీద నేరుగా తగిలి ఉంటే ప్రాణాపాయంగా మారేది. వెల్లంపల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 307 సెక్షన్ కింద కేసు పెట్టాం. కింద జనాల్లో నుంచే రాయి పైకి విసిరారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాలను నమ్మవద్దు” అని సీపీ కాంతిరానా టాటా తెలిపారు.

Also Read : సీఎం జగన్ పై దాడి.. ప్రధాని మోదీ, చంద్రబాబు ఏమన్నారంటే..