విజయవాడ సింగ్ నగర్‌లో కంటతడి పెట్టించే దృశ్యాలు.. ఖాళీ చేసి వెళ్లిపోతున్న వేలాది మంది ప్రజలు..

వచ్చిన బోట్లన్నీ పాడవడంతో వాటిని సిబ్బంది పక్కన పెట్టేశారు. దీంతో మరోదారి లేక అవస్థలు పడుతూనే నీటిలో నడుచుకుంటూ బయటకి వస్తున్నారు ప్రజలు.

విజయవాడ సింగ్ నగర్‌లో కంటతడి పెట్టించే దృశ్యాలు.. ఖాళీ చేసి వెళ్లిపోతున్న వేలాది మంది ప్రజలు..

Vijayawada Floods : భారీ వర్షాలు, వరదలతో విజయవాడ చిగురుటాకులా వణికిపోయింది. సింగ్ నగర్ అల్లకల్లోలంగా మారింది. ఎటు చూసినా వరద నీరే కనిపిస్తోంది. అక్కడ దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. చుట్టూ నీరే ఉండటంతో మరో దారి లేక వేలాది మంది ప్రజలు సింగ్ నగర్ ను ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు.

కాగా.. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ పనితీరుపై సింగ్ నగర్ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోట్ల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని వాపోతున్నారు. తమను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. మెయిన్ రోడ్ లో మాత్రమే బోట్లు తిప్పుతున్నారని, లోపల ఉన్న వారిని అస్సలు పట్టించుకోవడం లేదని కన్నీటిపర్యంతం అవుతున్నారు. మరోవైపు సింగ్ నగర్ వద్ద ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బోట్లు పని చేయడం లేదు. వచ్చిన బోట్లన్నీ పాడవడంతో వాటిని సిబ్బంది పక్కన పెట్టేశారు. దీంతో మరోదారి లేక మోకాలి లోతు నీటిలో అవస్థలు పడుతూనే నీటిలో నడుచుకుంటూ బయటకి వస్తున్నారు ప్రజలు.

ఇళ్లలోకి నీరు చేరిందని, సర్వస్వం కోల్పోయామని బాధితులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. నడుం లోతు వరకు ఉన్న నీళ్లలోనే అతి కష్టం మీద నడుచుకుంటూ కట్టుబట్టలతో ఇళ్ల నుంచి వెళ్లిపోతున్నారు బాధితులు.

నీట మునిగిన రాజధాని గ్రామాలు
అటు.. రాజధాని గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. వెంకటపాలెం, మందడం గ్రామాల్లో పెద్దఎత్తున వరద నీరు చేరడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంకటపాలెంలో మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమంలోకి నీరు చేరింది. ఆశ్రమంలో ఉన్న వారిని తాళ్ల సాయంతో బయటికి తరలించారు. ఆశ్రమం లోపల నలుగురు సాధకులు వరద నీటిలోనే చిక్కుకున్నారు. వారి కోసం బోటు ఏర్పాటు చేశారు.

Also Read : వరద ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన.. డ్రోన్ల ద్వారా ఆహారాన్ని సరఫరా చేసేందుకు సర్కారు సిద్ధం

కరకట్టకు గండి..
ఆశ్రమ సాధకులు తమ తమ స్వస్థలాలకు వెళ్లిపోతున్నారు. సాధకులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ వారికి చేయూత ఇస్తున్నారు మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమ సిబ్బంది. ఆశ్రమం పక్కనే కరకట్టకు గండి పడింది. చెరువు మాదిరి వెంకటపాలెం వైపు వరద నీరు దూసుకుపోతోంది. గండి పూడ్చేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. చిన్నపాటి రంధ్రం వరద ధాటికి పెద్ద గండిలా మారిందని అధికారులు చెబుతున్నారు.