Gorantla Madhav : వాసిరెడ్డి పద్మ కేసు.. గోరంట్ల మాధవ్ కు నోటీసులు.. మార్చి 5న విచారణకు రాకపోతే..
ప్రశ్నించే ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసుకుంటూ పోతున్నారని ఆయన మండిపడ్డారు.

Gorantla Madhav : వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. అనంతపురంలో గోరంట్ల మాధవ్ ఇంటికి వెళ్లిన విజయవాడ పోలీసులు ఆయనకు నోటీసులు అందించారు. గతంలో హిందూపురం వద్ద జరిగిన అత్యాచారం కేసుపై మాట్లాడుతూ.. బాధితురాలి పేరును.. ఒక ఇంటర్వ్యూలో గోరంట్ల మాధవ్ చెప్పారంటూ నమోదైన కేసులో విచారణకు హాజరు కావాలని విజయవాడ పోలీసులు పేర్కొన్నారు.
2024 నవంబర్ 2న మాధవ్ పై మాజీ మహిళా చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్యాచార బాధితురాలిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాధవ్ పై పోక్సో కేసు నమోదు చేయాలని వాసిరెడ్డి పద్మ కోరారు.
అత్యాచారం కేసులో బాధితుల పేర్లు బహిరంగంగా చెప్పడాన్ని ఆమె తప్పు పట్టారు. ఈ ఫిర్యాదు ఆధారంగా 72, 79 బీఎన్ఎస్ సెక్షన్ల కింద మాధవ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. మార్చి 5న విచారణకు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కి రావాలని మాధవ్ కు ఇచ్చిన నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు.
విజయవాడ పోలీసులు నోటీసులు ఇవ్వడంపై మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో త్వరలో అంతర్యుద్ధం రానుందన్నారు. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గమనించాలని అన్నారు.
ప్రశ్నించే ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసుకుంటూ పోతున్నారని ఆయన మండిపడ్డారు. తాను అత్యాచార బాధితుల తరఫున మాట్లాడానని చెప్పారు. ఏం మాట్లాడినా కేసులు పెడతామంటే ప్రజలు హర్షించరని మాధవ్ అన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛకు ఈ ప్రభుత్వం భంగం కలిగిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో జరగబోయే పరిణామాలకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ బాధ్యులవుతారని గోరంట్ల మాధవ్ హెచ్చరించారు.