Kinjarapu Atchannaidu : మమ్మల్ని భయబ్రాంతులకు గురి చేసేందుకే కాల్పులు జరిపారు- అచ్చెన్నాయుడు
దాడులకు పాల్పడిన వైసీపీ కార్యకర్తలను వదిలేసి టీడీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం దుర్మార్గం అన్నారు. Kinjarapu Atchannaidu

Kinjarapu Atchannaidu
Kinjarapu Atchannaidu – Vinukonda Clash : పల్నాడు జిల్లా వినుకొండలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రంగా స్పందించారు. వినుకొండలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ వర్గాల దాడి అప్రజాస్వామికం అన్నారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని ఆయన మండిపడ్డారు.
టీడీపీ లక్ష్యంగా వైసీపీ నాయకులు, శ్రేణులు నిత్యం దాడులకు పాల్పడుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోందని ధ్వజమెత్తారు. స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ప్రోద్బలంతోనే వైసీపీ కార్యకర్తలు టీడీపీ వర్గాలపై దాడికి తెగబడ్డారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. వైసీపీ వర్గాల దాడిలో 15మంది టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయని చెప్పారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్న విషయాన్ని గమనించాలని అచ్చెన్నాయుడు సూచించారు.
దాడులకు పాల్పడిన వైసీపీ కార్యకర్తలను వదిలేసి టీడీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం దుర్మార్గం అన్నారు. టీడీపీ కార్యకర్తలను భయబ్రాంతులకు గురిచేసేందుకే పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారని అచ్చెన్నాయుడు అన్నారు. శాంతి భద్రతలను కాపాడటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అచ్చెన్నాయుడు విమర్శించారు. తక్షణమే దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేసి పరిస్థితిని నియంత్రణలోకి తీసుకురావాలని పోలీసులను అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.