Jagan Visakha Tour: జగన్ విశాఖ పర్యటన.. పోలీస్ అనుమతిపై కమిషనర్ కీలక ప్రకటన.. నటుడు విజయ్ రోడ్ గురించి ప్రస్తావన..
విశాఖ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎయిర్ పోర్ట్ కూడలి నుంచి మర్రిపాలెం కూడలి వరకు 11 కిలోమీటర్లు వైఎస్ జగన్ పర్యటన మార్గం ఉందన్నారు.

Jagan Visakha Tour: వైసీపీ చీఫ్ జగన్ అక్టోబర్ 9న ఉమ్మడి విశాఖ పర్యటనకు సంబంధించి పోలీస్ అనుమతులపై విశాఖ పోలీస్ కమిషనర్ శంఖ బ్రత బాగ్చి కీలక ప్రకటన చేశారు. జగన్ పర్యటనకు పోలీస్ అనుమతి లేదని ఆయన వెల్లడించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో జగన్ పర్యటన ఉన్నట్లు తమకు సమాచారం ఇచ్చారని ఆయన తెలిపారు. జగన్ విశాఖ ఎయిర్ పోర్టుకి 11 గంటలకు చేరుకుంటారు, రోడ్డు మార్గంలో మాకవరపాలెం వరకు వెళ్ళే యోచన ఉన్నట్టు చెప్పారాయన.
అదే రోజు ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ మ్యాచ్ ఉందని, ఆరోజు పెద్ద సంఖ్యలో మ్యాచ్ కు వస్తున్నారని, పోలీస్ మొత్తం ఆ బందోబస్తు సేవలు అందిస్తారని ఆయన వెల్లడించారు. ఆరోజు చిన్న పొరపాటు జరిగినా నగరానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. అందుకే పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
విశాఖ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎయిర్ పోర్ట్ కూడలి నుంచి మర్రిపాలెం కూడలి వరకు 11 కిలోమీటర్లు వైఎస్ జగన్ పర్యటన మార్గం ఉందన్నారు. ర్యాలీగా వేల మంది వస్తారని సమాచారం ఉందన్నారు. జాతీయ రహదారి బ్లాక్ అవుతుందన్నారు. తమిళనాడులో సినీ నటుడు విజయ్ రోడ్ షో కి ఏ విధమైన ఇబ్బంది వచ్చిందో అదే పరిస్థితి వస్తుందన్నారు. ఈ కారణాలతో వైఎస్ జగన్ పర్యటనకు పోలీస్ అనుమతి లేదని కమిషనర్ శంఖ బ్రత బాగ్చి తేల్చి చెప్పారు. ఇదే విషయాన్ని నేరుగా జగన్ కి లేఖలో తెలియజేస్తున్నామన్నారు.
Also Read: ‘మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ..’ రంగంలోకి జగన్.. ఇక సమరమే.. అక్టోబర్ 10 నుంచి..