మూడు రాజధానులు..విశాఖ సానుకూలతలు..ప్రతికూలతలు

  • Published By: madhu ,Published On : December 18, 2019 / 01:34 AM IST
మూడు రాజధానులు..విశాఖ సానుకూలతలు..ప్రతికూలతలు

Updated On : December 18, 2019 / 1:34 AM IST

విశాఖపట్నం దశ తిరిగినట్టేనన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇంతకీ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖనే జగన్ ఎందుకు ఎంచుకున్నారు? అసలు ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా ఉండే స్థాయి విశాఖ నగరానికి ఉందా? విశాఖకు ఉన్న సానుకూలతలేంటి? ప్రతికూలతలు ఏంటి? ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ప్రకటనతో విశాఖలో రియల్ భూమ్ ఎలా ఉండబోతోంది? ఏపీ ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా విశాఖను అభివృద్ధి చేస్తామని సీఎం జగన్ శాసనసభలో 2019, డిసెంబర్ 17వ తేదీ మంగళవారం ప్రకటించారు. దీంతో ఇక ఏపీ సచివాలయం విశాఖకు తరలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కీలకం కావడంతో… ఇక ఏపీలో మిగతా నగరాల కంటే విశాఖ మరింత వేగంగా అభివృద్ధి పథంలో దూసుకుపోనుంది. 

అనుకూలతలు : – 
విశాఖలో ప్రభుత్వ భూములు కూడా ఎక్కువగా ఉండటంతో… ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. విశాఖను రాష్ట్రానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ చేయడం వల్ల ఉత్తరాంధ్ర ప్రజలను సంతృప్తి పరచవచ్చని ప్రభుత్వం భావనగా కనిపిస్తోంది. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖకు ఉన్న అర్హతలను ఓ సారి పరిశీలిస్తే.. ఉత్తరాంధ్రకు విశాఖ ముఖద్వారంగా ఉంది. ఇప్పటి కే అభివృద్ది చెందిన నగరం. రైల్వే, రోడ్డు, జల, వాయు మార్గాల కనెక్టివిటి ఉంది. పరిపాలనకు అనువైన వాతావరణం, మౌలిక వసతులు, ఇతర సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.

విశాఖను రాష్ట్రానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ చేయడం వల్ల ఉత్తరాంధ్ర ప్రాంతం కుడా అభివృద్ధి చెందే అవకాశముంది. విద్యా పరంగా రాష్ట్ర, కేంద్ర ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. అన్ని విధాలుగా ఐటీకి విశాఖ అనుకూలమైన ప్రదేశం. ఇప్పటికే విశాఖను అనేక ఐటీ కంపెనీలు వేదికగా చేసుకున్నాయి. సినిమా ప్రరిశ్రమకు సానుకూలమైన ప్రదేశం. విశాఖ వేదికగా చిత్ర పరిశ్రమ విస్తరించింది. పర్యాటకంగా, పారిశ్రామికంగా అభివృద్ది చెందింది. భోగాపురం విమానశ్రాయం వస్తే రెండు విమాశ్రయాలు అందుబాటులో ఉంటాయి. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలను ట్రై సిటిగా అభివృద్ధి చేసే అవకాశం ఉంది. 

ప్రతికూల అంశాలు : – 
ప్రతికూల అంశాలను పరిశీలిస్తే.. విశాఖ లో కాస్ట్ ఆప్ లివింగ్ ఎక్కువుగా ఉంది. ఒకే ఒక్క జాతీయ రహదారి తప్ప వేరే రోడ్డు మార్గాలు ఏర్పాటు చేయలేని పరిస్థితి. విశాఖను ఇప్పటికే ట్రాఫిక్ సమస్య వేధిస్తోంది. పరిపాలనా విభాగం ఇక్కడి మారితే ఆ సమస్య మరింత ఎక్కువవుతుంది. ఇక విశాఖలోని ఎక్కువ ప్రాంతాలు తూర్పు నేవిక దళం, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల అధీనంలో ఉన్నాయి. నగర పరిధిలో ప్రభుత్వ భూములు తక్కువగా ఉన్నాయి. అభివృద్ది పనులుచేపట్టాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరక తప్పని పరిస్థితి ఉండడం ప్రతికూల అంశంగా చెప్పవచ్చు. 

రియల్ ఎస్టేట్ వ్యాపారం విషయానికొస్తే.. విశాఖలో రియల్ బూమ్ కొనసాగుతోంది. ఇప్పటికే చుక్కలనంటుతున్న భూముల ధరలు, ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా మారితే పదింతలు పెరిగే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం నగర పరిధి దాటుకుని పరిసర ప్రాంతాలకు విస్తరిస్తుంది. ట్రై సిటిగా మారే అవకాశం ఉన్నందున శ్రీకాకుళం, విజయనగరం, విశాఖల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం రెక్కలు విప్పుకోవడం ఖాయమన్న వాదన బలంగా వినిపిస్తోంది. 
Read More : పార్టీ మారుతారా : మూడు రాజధానులు..జై కొట్టిన గంటా