ఎంపీ చిన్నిపై కేశినేని నాని మాటల యుద్ధం.. స్పందించిన చిన్ని.. ఏమిటీ గొడవ?

ఇందుకు సంబంధించిన వివరాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎక్స్‌లో నాని తెలిపారు.

ఎంపీ చిన్నిపై కేశినేని నాని మాటల యుద్ధం.. స్పందించిన చిన్ని.. ఏమిటీ గొడవ?

Updated On : May 5, 2025 / 2:51 PM IST

మాజీ ఎంపీ కేశినేని నాని, ఆయన సోదరుడు కేశినేని చిన్ని మధ్య మాటల యుద్ధం జరిగింది. ఏపీలో మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన కేసిరెడ్డి రాజశేఖరరెడ్డితో పాటు దిలీప్ ​పైలాకు కేశినేని చిన్నికి సంబంధం ఉందంటూ కేశినేని నాని ఎక్స్‌లో ఆరోపణలు గుప్పించారు.

ఇందుకు సంబంధించిన వివరాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎక్స్‌లో నాని తెలిపారు. ఈ కేసులో కసిరెడ్డి, కేశినేని చిన్ని, ఆయన భార్య జానకి లక్ష్మి ప్రైడ్ ఇన్‌ఫ్రాకాన్ ఎల్ఎల్పీ కంపెనీలో పార్ట్‌నర్లుగా ఉన్నట్లు చెప్పారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో ఆ కంపెనీ ఉందని తెలిపారు. అదే అడ్రస్‌తో కసిరెడ్డి, దిలీప్‌ పైలా కూడా ఇషాన్వి ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉందని చెప్పారు.

ఆ రెండు కంపెనీలు ఒకే ఈ మెయిల్ ఐడీని వాడుతున్నట్లు వివరించారు. ఇప్పటికే ఇద్దరు కీలక వ్యక్తులను అరెస్ట్ చేశారని, వారితో కేశినేని చిన్నికి ప్రత్యక్షంగానే సంబంధాలు ఉన్నాయని తెలిపారు. లిక్క్‌ స్కామ్‌తో సంబంధం ఉన్న డబ్బును కేశినేని చిన్ని హైదరాబాద్‌లోని రియల్ ఎస్టేట్‌తో పాటు ఫారిన్ సంస్థల్లో ఇన్వెస్ట్‌మెంట్‌కు తరలించినట్లు తన వద్ద సమాచారం ఉందన్నారు. నగదు అక్రమ చలామణీకి పాల్పడి ఉండవచ్చని అన్నారు. దీనిపై చంద్రబాబు నాయుడు వెంటనే జోక్యం చేసుకోవాలని, విచారణ చేయించాలని చెప్పారు.

ఎంపీ చిన్ని స్పందన
తన సోదరుడు చేసిన ఆరోపణలపై ఎంపీ కేశినేని చిన్ని స్పందించారు. కేశినేని నాని చేసిన ఆరోపణలపై స్పందించాల్సిన అవసరం తనకు లేదని చెప్పారు. కేశినేని నాని గతంలో టీడీపీలో ఉన్న సమయంలోనే వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌కు అనుకూలంగా పనిచేశారని ఆరోపించారు. తమ కంపెనీకి చెందిన ఆస్తి వద్దే కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి చెందిన కంపెనీ స్థలం ఉందని అన్నారు.

ఈ కారణంగానే జూబ్లీహిల్స్‌లో నిర్మాణ పనుల కోసం 2021‌లో రిజిస్టర్ అయిందని చెప్పారు. తాను పాలిటిక్స్‌లోకి రాకముందే కేసిరెడ్డి కంపెనీతో తెగతెంపులు చేసుకున్నట్లు వివరించారు. తాను ఫారిన్‌లో ఇన్వెస్ట్‌మెంట్లు చేశానని కేశినేని నాని చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు.