TTD laddu row: ఏపీలో సెగలు పుట్టిస్తున్న హిందుత్వ సెంటిమెంట్
హిందుత్వంపై ఎక్కడా వెనక్కి తగ్గేదేలే అన్న సంకేతాలిస్తోందంటున్నారు.

హిందూత్వం… ఓ భావజాలం.. ఎన్నికల్లో హిందుత్వ సెంటిమెంట్‌తో ఓట్లు కొల్లగొట్టాలని కొన్ని పార్టీలు.. ఇంకొందరు నేతలు హిందుత్వ సెంటిమెంట్‌ను నెత్తికెత్తుకుంటారు.. మరి ఇప్పుడు ఎన్నికలు లేకపోయినా ఏపీలో హిందుత్వ సెంటిమెంట్ సెగలు పుట్టిస్తోంది. తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారనే ఆరోపణలతో మొదలైన లొల్లి.. హిందూ ఎజెండాను చాటిచెప్పుకునే దిశగా వెళుతోందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
విపక్షంపై పైచేయి సాధించడమే లక్ష్యంగా మొదలైనే లడ్డూ వివాదంలో కూటమిలోని మూడు పార్టీలూ పోటాపోటీగా వ్యవహరిస్తున్నాయంటున్నారు. ధర్మ పరిరక్షణ పేరిట జరుగుతున్న ఈ యుద్ధంలో వైసీపీని మూడు పార్టీలో ఓ ఆట ఆడుకుంటుండటమే ఇప్పుడు టాక్ ఆఫ్ ద నేషన్ అంటున్నారు.
తిరుపతి లడ్డూ వివాదంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ రాజకీయంగా పైచేయి సాధించారా? అంటే ఔననే సమాధానమే వినిపిస్తోంది. దేవుడి విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండే ముఖ్యమంత్రి చంద్రబాబు…. తిరుమల శ్రీవారి ప్రసాదంలో తప్పు జరిగిందని తెలిసిన వెంటనే యాక్షన్‌లోకి దిగిపోవడం ఆయనకు మైలేజ్ పెంచినట్లు చెబుతున్నారు. అసలే చిన్నపాటి తప్పును కూడా సీరియస్‌గా భావించే సీఎం చంద్రబాబు… లడ్డూ ప్రసాదంలో ఘోర అపచారం జరగడాన్ని జీర్ణించుకోలేకపోయారు.
వైసీపీని కోలుకోలేని దెబ్బ
ఇక ఇందులో విపక్ష నేతల నిర్లక్ష్యం స్పష్టమైన ఆధారాలు లభించండంతో వైసీపీని కోలుకోలేని దెబ్బతీశారని చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సడన్ యాక్షన్‌తో వైసీపీ షాక్‌కు గురైనట్లు చెబుతున్నారు. ఈ విషయంలో ప్రజల నుంచి కూడా ప్రభుత్వానికి మద్దతు లభించడంతో వైసీపీని మరింత ఇబ్బంది పెట్టిందంటున్నారు. ఈ విషయం నుంచి ఎలా బయటపడాలనే అంశంలో వైసీపీ తర్జనభర్జన పడుతుండగానే… డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రంగంలోకి దిగి వైసీపీని మరింత దెబ్బతీశారంటున్నారు.
ప్రసాదంలో వాడే నెయ్యిలో కల్తీ జరిగిందని సీఎం చంద్రబాబు ప్రకటించడంతోనే గత ప్రభుత్వాన్ని దోషిని చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తిరుపతి వెంకటేశ్వరస్వామి భక్తుడైన చంద్రబాబు… స్వామి సేవలో జరిగిన పొరపాటుకు తగిన ప్రాయశ్చిత్తంగా హైందవ ఆచార వ్యవహారాల ప్రకారం ఆలయ శుద్ధికి శ్రీకారం చుట్టి హిందువుల మనోభావాలకు పెద్ద పీట వేశారని.. ఈ విషయంలో రాజకీయానికి తావులేదని చెబుతూనే విపక్షాన్ని ఎక్కడికక్కడ ఒంటరిని చేశారని అంటున్నారు.
కూటమి ఎంత బలంగా ఉన్నా, తమ జోలికి రావాలంటే బీజేపీ పెద్దలు అంగీకరంచరనే ధీమాలో ఇన్నాళ్లూ తేలియాడిన వైసీపీ పెద్దలకు లడ్డూ అంశంలో పెద్ద ఝలక్ ఇచ్చారు చంద్రబాబు. గత ఐదేళ్లు బీజేపీ పెద్దల మనసును మెప్పించేలా నడుచుకున్న మాజీ ముఖ్యమంత్రి జగన్.. లడ్డూ విషయంలో బీజేపీ పెద్దల ఆగ్రహాన్ని చవిచూస్తున్నారని అంటున్నారు. అంతేకాదు ఈ ఒక్క అంశంతో వైసీపీతో కొనసాగుతున్న బంధం బీజేపీ తెంచుకోవాల్సిన పరిస్థితి ఎదురైందని చెప్పుకుంటున్నారు.
దేశవ్యాప్తంగా ఆర్‌ఎస్‌ఎస్‌తోపాటు హిందూ సంఘాలు అన్నీ జగన్‌కు వ్యతిరేకంగా ధర్నాలు చేయడంతోపాటు కేంద్ర మంత్రులు కూడా తిరుమల ప్రసాదంలో అపచారంపై తీవ్ర ఆగ్రహాన్ని అసంతృప్తిని వ్యక్తం చేయడం… ముఖ్యమంత్రి చంద్రబాబు చాణక్యమేనంటున్నారు. ఇక ఇదే విషయంలో బీజేపీ-వైసీపీ మధ్య బంధాన్ని తుడిచేసిన చంద్రబాబు… తాను కూడా హిందుత్వానికి అనుకూలమనే సంకేతాలిచ్చేలా పాప ప్రక్షాళన అంటూ ఆలయంలో శాంతి హోమాలు, సంప్రోక్షణలు చేయడం హిందూ సంఘాలను ఆకర్షిస్తోందంటున్నారు.
ఒక్క దెబ్బకు ‘రెండు’..
ఇలా లడ్డూ విషయంలో ఇటు వైసీపీని బైల్డ్ చేసిన చంద్రబాబు… బీజేపీని మరింత దగ్గరకు చేర్చుకున్నారని అంటున్నారు. ఇదే సమయంలో కూటమిలోని మరో కీలక భాగస్వామి, డిప్యూటీ సీఎం పవన్ కూడా హిందూత్వానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తూ తనకు తాను చాంపియన్‌గా నిలవాలనే ప్రయత్నం చేస్తున్నారు. సనాతన ధర్మ రక్షణ జరగాలని… అందుకోసం తాను ఏం చేయడానికైనా సిద్ధమని చెబుతున్న డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్… హిందూత్వంపై తనతో పోటీ పడలేరన్నట్లు దూసుకుపోతున్నట్లు చెబుతున్నారు. విమర్శలు, వ్యాఖ్యలతోనే ఆగకుండా పాప ప్రక్షాళన జరగాలని ఏకంగా ప్రాయశ్చిత్య దీక్ష చేయడమూ ఓ వర్గాన్ని హత్తుకున్నట్లైందని అంటున్నారు.
ఇదే సమయంలో బీజేపీ నేతలు కూడా వివిధ దశల్లో ఆందోళనలకు దిగడం… అపచారానికి పాల్పడిన వారిని శిక్షించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతుండటంతో హిందుత్వంపై ఎక్కడా వెనక్కి తగ్గేదేలే అన్న సంకేతాలిస్తోందంటున్నారు. ఇలా ఏపీలో ఎన్‌డీఏ కూటమి… హిందూత్వ సెంటిమెంట్‌ను రగల్చి హిందూత్వ కూటమిగా మారిందనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.
చంద్రబాబు గత ప్రభుత్వాల్లో బీజేపీ భాగస్వామి అయినప్పటికీ ఎప్పుడూ ఇంతలా ఏకపక్షంగా హిందూ ఏజెండా అమలు చేసేలా అడుగులు వేయలేదని.. కానీ, ఇప్పుడు వైసీపీని పూర్తిగా తుడిచిపెట్టాలంటే హిందూ ఏజెండా కూడా ముఖ్యమనే ఆలోచనతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇలాంటి అడుగులు వేస్తున్నారని చెబుతున్నారు. మొత్తానికి ఏపీ రాజకీయం సరికొత్త రంగు పులుముకోవడమే టాక్ ఆప్ ద నేషన్‌గా మారిందంటున్నారు.
రాజ్యసభ సభ్యత్వానికి ఆర్.కృష్ణయ్య రాజీనామా.. తదుపరి కార్యాచరణ ఏంటి?