హాట్ హాట్‌గా కల్యాణదుర్గం రాజకీయం.. వైసీపీ కొత్త ప్రయోగం ఫలిస్తుందా?

సిట్టింగ్ ఎమ్మెల్యేను తప్పించిన వైసీపీ.. సామాజిక సమీకరణాలతో చేస్తున్న ప్రయోగం ఫలిస్తుందా? వర్గపోరుతో సతమతమవుతున్న టీడీపీ.. ఎన్నికల్లో ఆ ఇబ్బందులను అధిగమించగలదా?

హాట్ హాట్‌గా కల్యాణదుర్గం రాజకీయం.. వైసీపీ కొత్త ప్రయోగం ఫలిస్తుందా?

Kalyandurg Assembly Constituency: రాయలసీమలో ఈ సారి సీనేంటి? గత ఎన్నికల్లో హవా చూపిన ఫ్యాన్ స్పీడ్ ప్రస్తుతం ఎలా ఉంది? ఒకప్పుడు టీడీపీకి అడ్డాగా ఉన్న అనంతపురం జిల్లాలో ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఐదుసార్లు పసుపు జెండా ఎగరేసిన కల్యాణదుర్గంలో తాజా రాజకీయం ఎలా ఉంది? సిట్టింగ్ ఎమ్మెల్యేను తప్పించిన వైసీపీ.. సామాజిక సమీకరణాలతో చేస్తున్న ప్రయోగం ఫలిస్తుందా? వర్గపోరుతో సతమతమవుతున్న టీడీపీ.. ఎన్నికల్లో ఆ ఇబ్బందులను అధిగమించగలదా? కల్యాణదుర్గం పొలిటికల్ స్టోరీ ఏంటి?

కర్ణాటక సరిహద్దుల్లోని కల్యాణదుర్గం నియోజకవర్గం రాజకీయం హాట్ హాట్‌గా మారింది. ఎన్నికల ముందు వరకు రెండు పార్టీల్లోనూ గ్రూప్‌వార్ ఓ రేంజ్‌లో కొనసాగగా, అధికార వైసీపీ మార్పులతో కొంతవరకు పార్టీని చక్కదిద్దినట్లు కనిపిస్తోంది. ఇదే సమయంలో ఇద్దరు నేతలను పక్కనపెట్టిన టీడీపీ.. కొత్త నేతను తెరపైకి తెచ్చి.. ఆధిపత్య పోరాటానికి ముగింపు పలికింది. దీంతో రెండు పార్టీల్లోనూ కార్యకర్తలు ఎన్నికల్లో ఉత్సాహంగా పనిచేస్తున్నారు.

ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే మంత్రి పదవి
1952లో ఏర్పడిన కల్యాణదుర్గం నియోజకవర్గానికి ఇప్పటివరకు 13 సార్లు ఎన్నికలు జరిగితే ఐదుసార్లు గెలిచింది టీడీపీ.. 1983లో టీడీపీ ఆవిర్భావం తర్వాత కల్యాణదుర్గంలో స్పష్టమైన ఆధిక్యం చూపింది. ఐదుసార్లు టీడీపీ నేతలే ఎమ్మెల్యేలుగా నెగ్గితే ఓ సారి టీడీపీ మద్దతుతో కమ్యూనిస్టులు విజయం సాధించారు. ఇక కాంగ్రెస్ రెండు సార్లు, వైసీపీ ఓ సారి మాత్రమే కల్యాణదుర్గంలో గెలిచాయి. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఉషశ్రీ చరణ్ దాదాపు 19 వేల మెజార్టీతో గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే ఆమెకు మంత్రి పదవిని సైతం కట్టబెట్టారు సీఎం జగన్. అయితే ఎమ్మెల్యేగా ఉషశ్రీచరణ్‌ను స్థానిక క్యాడర్ వ్యతిరేకించడంతో ప్రస్తుతం పెనుగొండ నియోజకవర్గానికి మార్చింది వైసీపీ.

బీసీ ఓట్లే ఎక్కువ..
కల్యాణదుర్గం నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల 27 వేల ఓట్లు ఉండగా, బీసీల ఓట్లే ఎక్కువ. ముఖ్యంగా బీసీల్లోని బోయ సామాజికవర్గం ఓట్లు సుమారు 40 వేల వరకు ఉన్నాయి. యాదవ, కురబ సామాజికవర్గం ఓట్లు మరో 40 వేల వరకు ఉండగా, ఎస్సీల్లోని మాదిగ సామాజికవర్గం ఓట్లు కూడా దాదాపు 38 వేలు ఉన్నాయి. బీసీ ఓట్లు ఎక్కువగా ఉండటంతో ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి బలమైన పట్టు సాధించింది. ఐతే గత ఎన్నికల్లో టీడీపీకి చెక్ పెట్టిన వైసీపీ.. ఈ సారి కూడా సామాజిక సమీకరణాలతో కొత్త ప్రయోగం చేస్తోంది. బీసీల్లోని బోయ సామాజికవర్గానికి చెందిన నేతకు ఎమ్మెల్యేగా బరిలో దింపుతోంది.

దూసుకుపోతున్న వైసీపీ అభ్యర్థి
కల్యాణదుర్గం వైసీపీ అభ్యర్థిగా అనంతపురం ఎంపీ తలారి రంగయ్యకు టికెట్ ఖరారు చేసింది వైసీపీ. దాదాపు మూడు నెలల క్రితమే ఎంపీ రంగయ్యకు కల్యాణదుర్గం బాధ్యతలు అప్పగించడంతో క్షేత్రస్థాయిలో దూసుకుపోతున్నారు ఎంపీ.. ఎంపీగా పనిచేసిన అనుభవం ఉండటంతోపాటు అంతకుముందు డీఆర్‌డీఏ పీడీగా పనిచేయడంతో క్షేత్రస్థాయిలో రంగయ్యకు విస్తృత పరిచయాలే ఉన్నాయి. ఇక ఎంపీగా కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేశానని.. ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని పీడిస్తున్న మంచినీటి సమస్యను పరిష్కరిస్తానంటున్నారు వైసీపీ అభ్యర్థి రంగయ్య.

Also Read: సై అంటే సై.. భరత్ వర్సెస్ వాసు.. రాజమండ్రిలో యువనేతల మధ్య హోరాహోరీ పోరు

ఈ సారి ఎలాగైనా గెలవాలని..
ఇక గత ఎన్నికల్లో చేజారిన సీటును ఈ సారి ఎలాగైనా గెలవాలని లక్ష్యంగా పావులు కదుపుతోంది టీడీపీ. దీంతో ఆర్థికంగా బలమైన నేతను కల్యాణదుర్గం బరిలో దింపింది. ఈ ఎన్నికల్లో కల్యాణదుర్గం నుంచి పోటీ చేయాలని మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి కుటుంబ సభ్యులతోపాటు, ఇన్‌చార్జి ఉమామహేశ్వరనాయుడు గట్టిగా ప్రయత్నించారు. ఐతే ఈ ఇద్దరు నేతలు ఐదేళ్లుగా వేర్వేరు వర్గాలుగా పోరాడటంతో అధిష్టానానికి తలనొప్పిగా మారారు. ఈ ఇద్దరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా… వేరొకరు ఓడించే పరిస్థితి ఏర్పడటంతో అనంతపురానాకి చెందిన కాంట్రాక్టర్‌ అలిమినేని సురేంద్రబాబును తెరపైకి తెచ్చింది టీడీపీ. బడా కాంట్రాక్టర్ అయిన సురేందర్‌బాబుకు టికెట్ ఇవ్వడంతో వర్గపోరుకు చెక్ చెప్పినట్లైంది. కార్యకర్తలు కూడా సురేంద్రబాబుకు మద్దతుగా నిలవడంతో ప్రస్తుతం గ్రౌండ్‌లెవల్‌లో పట్టుబిగిస్తున్నారు సురేంద్రబాబు.

Also Read: టీడీపీలో ఆ 10 మంది బడా నేతల భవిష్యత్తు ఏంటి? టికెట్ దక్కకపోవడానికి కారణాలేంటి?

ఇరుపార్టీల హోరాహోరీ పోరు
కార్యకర్తలు మద్దతుగా నిలుస్తున్నా, మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి, ఇన్‌చార్జి ఉమామహేశ్వరనాయుడు.. పార్టీ అభ్యర్థి సురేంద్రబాబుకు దూరం దూరంగానే ఉంటున్నారు. దీంతో ఆ ఇద్దరి అనుచరులు పార్టీ గెలుపునకు కృషి చేస్తారా, లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి కల్యాణదుర్గంలో ఇరుపార్టీల మధ్య పోరు హోరాహోరీగా జరిగే పరిస్థితే కనిపిస్తోంది. బీసీల ఓట్లపై గురిపెట్టిన వైసీపీ బీసీ నేతను ప్రయోగించడం ఎంతవరకు ఫలిస్తుందనేది ఆసక్తిరేపుతుండగా, అంగ, అర్థ బలాల్లో తిరుగులేని టీడీపీ అభ్యర్థి సురేంద్రబాబు.. ప్రతికూల పరిస్థితులు ఎలా అధిగమిస్తారనేది ఉత్కంఠ రేపుతోంది.