Roja Selvamani : బండారు సత్యనారాయణను వదిలిపెట్టను, సుప్రీంకోర్టు వరకైనా వెళ్తాను- మంత్రి రోజా
నాకు ఊహ వచ్చినప్పటి నుంచి ఇంతవరకు ఏ మగవాడు ఏ మహిళను ఇంత నీచంగా, ఇంత దరిద్రంగా, ఇంత దిగజారిపోయి మాట్లాడిన దాఖలాలు లేవు. Roja Selvamani
Roja Selvamani – Bandaru Satyanarayana : తనను ఉద్దేశించి టీడీపీ నేత బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై మరోసారి తీవ్రంగా స్పందించారు ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా. చంద్రబాబు తప్పులను డైవర్ట్ చేయడానికే టీడీపీ నేత బండారు తనను టార్గెట్ చేశారని ఆరోపించారు. ఈ విషయంలో బండారుని వదిలిపెట్టేది లేదన్న రోజా.. ఆయనపై పరువు నష్టం దావా వేస్తానన్నారు. ఈ కేసులో తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానన్న రోజా.. సుప్రీంకోర్టు వరకైనా వెళ్తానన్నారు. బండారు సత్యనారాయణ లాంటి వ్యక్తులకు తగిన శిక్ష పడాలని రోజా డిమాండ్ చేశారు. ఏపీలో టీడీపీ-జనసేన దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని మంత్రి రోజా ధ్వజమెత్తారు.
బెయిల్ వస్తే తప్పు చేయనట్లు కాదు..
స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయిన చంద్రబాబుని టీడీపీ నేతలు బయటకు తీసుకురాలేకపోతున్నారు. దీన్ని రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు. దాన్ని డైవర్ట్ చేయడానికి ఈరోజు నన్ను టార్గెట్ చేశారు. నాకు ఊహ వచ్చినప్పటి నుంచి ఇంతవరకు ఏ మగవాడు ఏ మహిళను ఇంత నీచంగా, ఇంత దరిద్రంగా, ఇంత దిగజారిపోయి మాట్లాడిన దాఖలాలు లేవు. నేను ఆరోజే చెప్పా. అరెస్ట్ అయ్యి బెయిల్ వస్తే బండారు సత్యనారాయణ తప్పు చేయనట్లు కాదు.
Also Read : అందుకే టాలీవుడ్ నటీమణులు సైతం రోజాకు మద్దతు ఇవ్వలేదు?: జనసేన
చట్టాల్లో మార్పులు రావాలి, మగాళ్లు వణికిపోవాలి:
మన చట్టాల్లో ఏడు సంవత్సరాలకి శిక్షకు లోబడి ఉంటే బెయిల్ ఇస్తారు. నేను కచ్చితంగా పరువు నష్టం దావా వేస్తాను. కచ్చితంగా చట్టాల్లో మార్పు రావాలి. ఏ సాధారణ మహిళను అయినా ఒక మగవాడు దిగజారి మాట్లాడాలి అంటే.. భయపడే పరిస్థితికి వచ్చే విధంగా మహిళలు అంతా ఒక టీమ్ వర్క్ గా పోరాడాలి అనుకున్నాం. ఈరోజు అందరం కలిసికట్టుగా ముందుకెళ్తున్నాం. కచ్చితంగా నేను దీన్ని వదిలిపెట్టను. దీన్ని లీగల్ గా ఎంతదూరమైనా తీసుకెళ్తాను. సుప్రీంకోర్టు వరకైనా వెళ్తాను” అని మంత్రి రోజా తేల్చి చెప్పారు.
Also Read : చంద్రబాబుకి బెయిల్ రాకపోతే? 9వ తేదీ తర్వాత తెరపైకి అత్తాకోడళ్లు?
మంత్రి రోజాకు పెరుగుతున్న మద్దతు:
మరోవైపు మంత్రి రోజాపై బండారు సత్యనారాయణ చేసిన అనుచిత వ్యాఖ్యలపై పలువురు మహిళలు మండిపడ్డారు. మంత్రి రోజా కో స్టార్స్, జాతీయస్థాయి నేతలు, పక్క రాష్ట్రాల నేతలు రోజాకు మద్దతుగా నిలిచారు. రోజాపై బండారు చేసిన వ్యాఖ్యలను వారంతా తీవ్రంగా ఖండించారు. సినీ నటీమణులు మీనా, రమ్యకృష్ణ రోజాకు మద్దతుగా నిలిచారు. బండారు సత్యనారాయణ వెంటనే రోజాకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా? అని నిలదీశారు. మహారాష్ట్ర ఎంపీ, సినీ నటి నవనీత్ కౌర్ సైతం రోజాకు మద్దతుగా నిలిచారు. ఇక నటీమణులు రాధిక, ఖుష్బూలు కూడా రోజాకు ఇప్పటికే తమ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.