చలిపులి : మరో నాలుగు రోజులు

  • Published By: madhu ,Published On : January 3, 2019 / 04:19 AM IST
చలిపులి : మరో నాలుగు రోజులు

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలను చలి వీడడం లేదు. మంచుతెరలు..శీతలగాలులతో జనాలు వణికిపోతున్నారు. బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. మరో నాలుగైదు రోజులు ఇలాగే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. పగటి ఉష్ణోగ్రతలలో ఎలాంటి మార్పు కనబడకపోయినా రాత్రి వేళ మాత్రం చలి పంజా విసురుతోంది. పెరుగుతున్న చలికి శ్వాస ఆడకపోవడంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. చలికి తట్టుకోలేక పలువురు మృత్యువాత పడుతున్నారు. 
పెథాయ్ తుపాన్ కంటే ముందు అంతగా లేని చలి…దాని తర్వాత విరుచుకపడింది. ఉదయం 11గంటలకు కూడా మంచు తెరలు వీడడం లేదు. దీనికి తోడు చల్లటి గాలులు వీస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో చిన్నారులు..వృద్ధులు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆదిలాబాద్‌లో 5 డిగ్రీలు, మెదక్‌లో 6 డిగ్రీలు, , లంబసింగిలో 1 డిగ్రీ, చింతపల్లిలో 3.2 డిగ్రీలు, మినములూరులో 4 డిగ్రీలు, పాడేరులో 6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి నుండి తట్టుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారు.